మాస్‌ ఫీస్ట్.. టాలీవుడ్ డైరెక్టర్‌తో హృతిక్ సినిమా!

by | Apr 8, 2025 | సినిమా

తెలుగు చిత్రసీమలో వరుస హిట్‌ సినిమాలతో డైరెక్టర్‌ బాబీ కొల్లి స్పీడ్‌ పెంచాడు.. ఇటీవలే డాకు మహారాజ్‌తో బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను మెప్పించాడు. రెండేళ్ల కిందట మెగాస్టార్‌ చిరంజీవితో వాల్తేరు వీరయ్య చిత్రం ద్వారా సూపర్‌ హిట్‌ అందుకున్నాడు. ఇలా భారీ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న బాబీ ప్రస్తుతం బాలీవుడ్‌ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌ రోషన్ తో సినిమా చేసేందుకు బాబీ సిద్ధమయ్యారని తెలుస్తోంది.
అందుకు సంబంధించిన కథను కూడా బాబీ రెడీ చేశాడట. ఈ సారి మరింత బలమైన కథతో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల హృతిక్‌ రోషన్ ను కలిసిన బాబీ స్క్రిప్ట్ వినిపించగా.. హృతిక్ రోషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారని సమాచారం.

ఇక హృతిక్‌ రోషన్-ఎన్టీఆర్‌ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్‌ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. వార్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రానికి అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత హృతిక్ రోషన్ – బాబీల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు టాలీవుడ్ డైరెక్టర్ల ప్రతిభ మీద చాలా నమ్మకం ఉంచుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటుతుండడంతో బాలీవుడ్‌ హీరోలు కూడా సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా, కమర్షియల్‌ చిత్రాల్ని తనదైన పంథాలో తెరకెక్కిస్తూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా బాబీ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటిదాకా టాలీవుడ్‌ హీరోలతో బ్లాక్ బస్టర్స్‌ అందించిన బాబీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ ఎలాంటి రికార్డులు బడ్డలుకోడతాడోనని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ ప్రియులు.