సినీ ప్రేమికులకు వినోదాల విందును పంచేందుకు మరో నెల సిద్ధమైంది. ఫిబ్రవరి నెలలో అభిమానులను అలరించేందుకు సరికొత్త చిత్రాలు రానున్నాయి. కొత్త ఏడాదిలో జనవరి నెలను తెలుగు చిత్ర పరిశ్రమ అద్భుతంగా ఆరంభించింది. జనవరిలో చాలా చిత్రాలు విడుదలైనా కూడా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘మన శంకరవరప్రసాద్’, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజసాబ్’ అలాగే మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి చిత్రాలకు మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో మరి ఫిబ్రవరిలో ఏ తెలుగు సినిమాలు విడుదల కానున్నాయి ? వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ? అనేది ఇప్పుడు చూద్దాం..
ఫిబ్రవరి మొదటి వారం తెలుగు ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొన నుంది. ఎందుకంటే దాదాపుగా పది వరకు తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ (Euphoria) తో పాటుగా సుమతీ శతకం(Sumathi Shathakam) , బ్లడ్ రోజెస్, ఆపరేషన్ పద్మ, బరాబర్ ప్రేమిస్తా, శ్రీ చిదంబరం గారు, చాయ్ వాలా, హనీ, వంటి తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. వీటిలో యుఫోరియా సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి రెండో వారం వాలంటైన్స్ వీక్ స్పెషల్ గా విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ (Funky) మూవీ, సంతోష్ శోభన్ నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమాలు విడుదల కానున్నాయి. ఇక ఫిబ్రవరి మూడో వారంలో సుహాస్ నటించిన ‘హే భగవాన్’ తో పాటుగా ‘చైనా పీస్’ అనే సినిమా విడుదల కానుంది. ఇక ఫిబ్రవరి చివరి వారంలో ‘స్క్రీమ్’ అనే సినిమా రానుంది. మొత్తానికి ఫిబ్రవరిలో దాదాపు ఇరవై సినిమాలు విడుదల కానుండగా.. వీటిలో ఒక్క ‘యుఫోరియా’ సినిమా మీద తప్ప ఏ సినిమా మీద కూడా అంతగా అంచనాలు లేవు. అలాగే ఈ ఫిబ్రవరిలో రీరిలీజ్ సినిమాల హవా కొనసాగనుంది. Ram Charan ఆరెంజ్ (Orange) మూవీ ఫిబ్రవరి 7న రానుండగా, మనసంతా నువ్వే (Manasantha Nuvve) , లవ్ స్టోరీ (Love Story) చిత్రాలు ఫిబ్రవరి 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో చూడాలి.

