ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22 వ తేదీ న సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు ఉన్న పరిస్థితులను సమీక్షించి మీడియాతో మాట్లాడారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ 4 వేల క్యూసెక్కు లతో, 30 టి ఎమ్ సి లు, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లా లకు నీళ్లు అందించడానికి 2005-06 లో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఈ ఎస్ ఎల్ బి సి.
2014 లో తెలంగాణ రాష్ట్రం వచ్చేవరకు 32 కిలో మీటర్ల టన్నెల్ పనులు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశించాము. తెలంగాణ ఏర్పడ్డాక, ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 2-3 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు.
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్ పని చేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించక పోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు, బిల్లులు చెల్లించలేదని విద్యుత్ నిలిపి వేయడం వంటి పనులు చేసింది దీనితో పని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే ఉండిపోయింది. దీనితో 10 సంవత్సరాలు పని ఆగిపోయింది
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనీ సంకల్పించింది. సాంకేతిక నిపుణులతో చర్చించి టన్నెల్ బోర్ కు సంబంధించిన కొన్ని రిపేర్లు, చెల్లించాల్సిన బిల్లులు చెల్లించి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని అమెరికా పంపించి స్పేర్ పార్ట్స్ ను కూడా తెప్పించి తిరిగి పనులను ప్రారంభించింది
పనులను వేగవంతంగా పూర్తి చేసి, దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి అని అనుకుంటే అనుకోకుండా ఈ ప్రమాదం జరిగింది. రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కరించుకోవాలి. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఈ విపత్తులో నైపుణ్యమున్న 11 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రెస్క్యూ ఆపరేషనల్ లో పని చేస్తున్నాయి. దీనిపై ప్రధాన మంత్రికి కూడా పూర్తి వివరాలను ఇచ్చాను
ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంతయ్యారు. వారు ఎలా ఉన్నారు అనే విషయంపై నిపుణులు ఇంకా ఒక అంచనాకు రాలేదు. ఇప్పుడే, నిపుణులతో చర్చినను. వారు చెప్పిన దాని ప్రకారం, ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి ఇంకా 2-3 రోజులు పడుతుంది
కన్వేయర్ బెల్ట్ పాడవడం వలన ఆ మట్టిని బయటకు పంపే వెసులుబాటు లేకుండా పోయింది రేపటి లోగా ఈ బెల్ట్ ను రిపేర్ చేసి మట్టిని, నీళ్ళని బయటకు పంపిస్తే కొంత పనులలో పురోగతి వస్తుంది
లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు, ఎక్కడ మిషనరీ విరిగిపోయి ఉన్నది అనే విషయాలపై పూర్తి స్థాయి అంచనాకు రాలేకపోతున్నారు. ప్రాధమిక అంచనాకు వచ్చారు
ఒకనాడు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జెనెరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చనిపోతే ప్రభుత్వ పెద్దలు ఎవరు సంఘటన స్థలానికి రాలేదు, ఎవరిని రానీయలేదు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరణించినప్పుడు ప్రభుత్వం లోని పెద్దలు పోలేదు, ఎవరిని పోనీయలేదు. మేము సంఘటన తెలిసిన వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ని, జూపల్లి కృష్ణారావు ని సంఘటన స్థలానికి పంపించాను
ప్రపంచంలోనే అతి పెద్ద టన్నెల్. 44 కిలో మీటర్ల టన్నెల్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది మానవులు సృష్టించిన అద్భుతం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది
పని చేసే అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి అనేది ప్రభుత్వ సూచన. అందుకే ఈ రోజు మనుషులు, మిషన్లతో పాటు అవసరమైతే రోబోలను కూడా వాడమని సూచన చేశాను. ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
సంఘటన జరిగిన వెంటనే సంబంధిత మంత్రి, శాసన సభ్యులు, జిల్లా యంత్రాంగం, నిపుణులు సంఘటన స్థలానికి వచ్చారు. ఏం జరిగినా ప్రభుత్వం మీద బురద చల్లాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ మైండ్ లో బురద మా మీద చల్లితే ఎలా అని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ప్రమాదం తాగి బండి నడిపి ప్రజలను గుద్దిన ప్రమాదం లాంటిది. ఎస్ ఎల్ బి సి ఎదురుగా ఉన్న మనిషిని బతికించడానికి చేసిన ప్రయత్నంలో పోయి చెట్టుకు గుద్దుకున్న ప్రమాదం లాంటిది అని ముఖ్యమంత్రి అన్నారు
ఈ రెండు ప్రమాదాలలో ఉన్న తేడా హరీష్ రావు గారికి అర్ధమయిందో, లేదో తెలియదు అని అన్నారు. సోయి తప్పి మాట్లాడితే ఎలా అని బి ఆర్ ఎస్ నాయకులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయారు, దానితో పాటు మైండ్ కూడా కోల్పోయారు అని బి ఆర్ఎస్ ను ఉద్దేశించి మాట్లాడారు
ఖచితంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, ఈ విషయంలోను అందరు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు

