‘రాబిన్‌హుడ్‌’ సినిమా రివ్యూ: కధ లేదు, కామెడీ ట్విస్ట్ లు

by | Mar 28, 2025 | సినిమా రివ్యూ

విడుదల తేది: 28–03–2025
నటీనటులు: నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్, శుభలేఖ సుధాకర్, షైన్ చాం టాకో, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, దేవదత్తా నాగే తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: సాయి శ్రీరామ్
సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌
నిర్మాతలు: నవీన్‌ యేర్నేని, రవి శంకర్
ఎడిటింగ్: కోటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వెంకీ కుడుముల

టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్, బ్యూటీ క్వీన్ శ్రీలీల హీరో, హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. నవీన్‌ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించగా.. సాయి శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. భీష్మ సినిమా త‌ర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్ప‌టికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజ‌ర్‌, ట్రైలర్ ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకున్నాయి. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాను ఉగాది పండుగ కానుకగా మార్చి 28న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? నితిన్ రాబిన్‌హుడ్‌తో
గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడా? నితిన్-శ్రీలీల జోడీ ఆడియన్స్ ను ఎలా మెప్పించింది? భీష్మ సినిమా తరహాలో నితిన్- వెంకీ కాంబో మరోసారి హిట్ కొట్టిందా? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

ఈ సినిమా కథలోమీ వెళ్తే.. హీరో రామ్ (నితిన్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు దూరమవుతారు. దాంతో శుభలేఖ సుధాకర్ నిర్వహిస్తున్న అనాథాశ్రమంలో పెరిగి పెద్దవుతాడు. అయితే ఆ అనాథాశ్రమానికి సరైన విరాళాలు రాకపోవడంతో అందులో ఉన్న పిల్లలు తిండికి కూడా లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ అనాథాశ్రమానికి అవసరమైన డబ్బుల కోసం హీరో దొంగతనాలు చేస్తుంటాడు. ధనవంతులను దోచేసి పేదవారి కడుపు నింపుతుంటాడు. పెద్దలను కొట్టు పేదోళ్లకు పెట్టు దింతో అందరూ నితిన్ ను రాబిన్ హుడ్ అనే పేరుతో పిలుస్తుంటారు. అయితే నితిన్ చేస్తున్న దొంగతనాలను ఆపేసి అతన్ని జైలుకు పంపాలనే లక్ష్యంతో స్పెషల్ ఆఫీసర్ విక్టర్ (షైన్ చాం టాకో) వెతుకుతూ ఉంటాడు. దీంతో కొన్ని రోజులు ఎక్కడైనా తలదాచుకుందాం అనే ఉద్దేశ్యంతో నితిన్.. జాన్ స్నో(రాజేందర్ ప్రసాద్) నిర్వహిస్తున్న ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు. అయితే ఉద్యోగంలో చేరిన రోజే ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత పారిశ్రామికవేత్త కూతురు నీరా వాసుదేవ్ (శ్రీ లీల) స్వదేశానికి వస్తుండడంతో ఆమె సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలను నితిన్, రాజేంద్రప్రసాద్ బృందం తీసుకుంటుంది. మాయ మాటలతో ఆమెను నమ్మించి రుద్రకొండ అనే అటవీ ప్రాంతానికి తీసుకెళ్తారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో ఉన్న సామి (దేవదత్తా నాగే) వలలో చిక్కుకుంటారు. సామి నుంచి నుంచి నీరాను రాబిన్ హుడ్ బృందం ఎలా కాపాడింది? అసలు నీరాను రుద్రకొండ ఎందుకు తీసుకెళ్లారు? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:

రాబిన్‌హుడ్ అని టైటిల్ పెట్టగానే సినిమా కథ ఏంటో ముందుగానే ఉహించేస్తారు. హీరో ఉన్న వారి దగ్గర దోచేసి లేని వారి కడుపు నింపుతాడు. నిజానికి ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. ఈ కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా రొటీన్ ఫార్మాట్ లోనే ఈ సినిమా తెరకెక్కించి అంచనాలను అందుకోలేకపోయాడు. హీరో నితిన్ ఇందులో రాబిన్ హుడ్ పాత్రలో మెప్పించాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి అలరించాడు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ గా కనిపిస్తూ.. కొన్ని సీన్స్ లో మెప్పించింది. సినిమాలో ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చే కథ, కథనం సాగదీతగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తెరపై తమదైన శైలిలో అలరించారు. సినిమా మొత్తాన్ని వీరే భుజస్కంధాలపై మోశారు. విక్టర్ పాత్రలో షైన్ టామ్ చాకో, సామి పాత్రలో దేవదత్తా నాగే మెప్పించారు. ఇక కేతికా శర్మ స్టెప్పులేసిన అదిదా సర్‌ప్రైజ్‌ సాంగ్‌ అభిమానుల్ని మెప్పించింది. ఇక డేవిడ్‌ వార్నర్‌ కేమియో కూడా సినిమాకి బాగా ప్లస్‌ అయింది. తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా వార్నర్ నటనలో తన మార్క్ చూపించాడు. జీవి ప్రకాష్ కుమార్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కోటి సెకండాఫ్ లో ఇంకొన్ని సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. దర్శకుడు వెంకీ కుడుములు తన మార్క్ ను చూపిస్తూ సినిమాను తెరకెక్కించినప్పటికీ కథ, కథనంను నడిపించే విషయంలో కాస్త తడపడ్డాడు. కథలో ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడం, కథనాన్ని నడిపించిన తీరు మెప్పించకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ నటన
కామెడీ
సెకండాఫ్ లో ట్విస్టులు

మైనస్‌ పాయింట్స్‌:
ఆసక్తి రేకెత్తించని కథ, కథనం

రేటింగ్: 2.5/5