టాలివుడ్ లో మాస్ మహారాజా రవితేజ, సెన్సిబిల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) కాంబినేషన్లో ‘ఇరుముడి’ (Irumudi) అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రవితేజ (Ravi Teja) 77వ చిత్రంగా ఈ సినిమా తెరపైకి రానుంది. కెరీర్ ఆరంభం నుంచి యాక్షన్, కమర్షియల్ చిత్రాలతో అభిమానులను అలరించిన రవితేజ ఈసారి కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మించనుంది. ఇందులో హీరోయిన్గా ప్రియా భవానీ శంకర్ నటించనుండగా.. జీ.వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఈ మూవీ కోసం అద్భుతమైన బాణీలు రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా, ఈ మూవీ ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుండగా, మరి కొద్ది రోజులలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ (Ravi Teja) డ్యూయల్ రోల్లో కనిపిస్తారట. ఈ రెండు పాత్రలు భిన్న కోణాల్లో సాగుతాయని చెబుతున్నారు. ఇందులో ఒక పాత్రలో రవితేజ అయ్యప్ప మాల ధరించిన భక్తుడిగా కనిపించనుండగా.. మరో పాత్రలో ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నిజానికి రవితేజకు ద్విపాత్రాభినయం కొత్తేం కాదు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడుతో పాటుగా దరువు, డిస్కో రాజాలో డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కాగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

