టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సమర్పణలో మనం ఎంటర్టైన్మెంట్స్ (Manam Entertainments) బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. నాగ్ ఈ సినిమాలో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందులో నాగార్జున (Nagarjuna) మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కథానాయికగా టబు (Tabu) నటిస్తోండగా.. మరో కథానాయికగా ‘నాట్యం’ ఫేమ్ సుస్మితా భట్ నటించనుందని తెలుస్తోంది.
గతేడాది ఈ సినిమాను ప్రకటించిన మేకర్స్ అప్పటి నుంచి గోప్యంగానే షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని కూడా మేకర్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి అప్ డేట్స్ బయటకు వెళ్లడించవద్దని హీరో నాగార్జున (Nagarjuna) చిత్రబృందానికి చెప్పారట. అందుకే సినిమా నుంచి ఎలాంటి విషయాలు బయటకు రావట్లేదు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక టైటిల్ తో పాటుగా విడుదల తేదీని నాగార్జునే స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను వేసవిలోపు పూర్తి చేసి దసరా పండుగ కానుకగా విడుదల చేయాలని నాగార్జున పక్కాగా ప్లాన్ తెలుస్తోంది. కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జున తన 100వ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ అందుకోవాలని పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. కాగా, ‘కింగ్ 100’ (KIng 100) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘100నాటౌట్’ ‘లాటరీ కింగ్’ (Lottery King) అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

