తెలుగు రాష్ట్రాలలో ఈటీవీ పేరు తెలియని తెలుగు వాడు ఉండడు. ఈటీవీ ప్రారంభించి 30 సంవత్సరాలు అయింది. ఈ క్రమంలో ఈటీవీ తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులతో మమేకమయ్యే విధంగా కార్యక్రమాలు చేసింది.
అయితే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారి మరణానంతరం మేనేజ్ మెంట్ లో యువ తరం, యువ రక్తం ఈటీవీ కార్యక్రమాలలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఎప్పుడు లేని విధంగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈటీవీ సినిమాలను ప్రసారం చేస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ఈటీవీ చరిత్రలో ఇది ఒక పెను మార్పు.
2026 సంక్రాంతికి వచ్చిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. ప్రస్తుతం ఈటీవీ విన్ నిర్మించిన చిత్రాలను, వెబ్ సిరీస్ లను కూడా ప్రసారం చేస్తున్నారు. మార్కెట్ సమాచారం ప్రకారం ఎన్టీఆర్ దేవర, పవన్ కళ్యాణ్ ఓ జి చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా ఈటీవీ వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.
అంతే కాకుండా రోజు రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతోన్న పాడుతా తీయగా, జబర్దస్త్, ఢీ షో లకు ముగింపు పలకనున్నారు. ఈ జులై నుండి రాత్రి 9.30 కి మరియు 10 గంటలకు కూడా సీరియల్స్ ను ప్రసారం చేయనున్నారు.
అంతే కాకుండా ఈటీవీ అభిరుచి ఛానల్ ను ఈటీవీ మ్యూజిక్ ఛానల్ గా మార్చనున్నారు. 30 సంవత్సరాల తరవాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లు రాజ్యం ఏలుతున్న వేళ, కాలానికి అనుగుణంగా మారాల్సిన తప్పని పరిస్థితులలో ఈటీవీ కొత్త మేనేజ్ మెంట్ ఈ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మార్పులు రాబోయే రోజులలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి

