‘RT77’ – ఆ దర్శకుడితో ‘రవితేజ’ కొత్త మూవీ

by | Jan 25, 2026 | సినిమా

మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం రవితేజ ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ తదుపరి సినిమా అప్‌డేట్‌ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా సెన్సిబిల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Siva Nirvana) దర్శకత్వంలో ఓ సినిమా రానుందని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. RT77 (RT77) వర్కింగ్ టైటిల్ తో రానున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. గతంలో నిన్ను కోరి, మజిలీ, ఖుషి వంటి ప్రేమ కథా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ ఈసారి ఓ ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రానున్నాడు.

జనవరి 26 రిపబ్లిక్ డే (Republic Day) కానుకగా ఉదయం 10 గంటలకు ఈ సినిమాలోని రవితేజ (Ravi Teja) ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకి ‘ఇరుముడి’ (Irumudi) టైటిల్‌ను పరిశీలిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తన కూతురిని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌ (Priya Bhavani Shankar) నటించనుండగా.. జీ.వీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.