రధ సప్తమి సందర్భంగా అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్య క్షేత్రం గురించి తెలుసుకుందాం.
శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం (Srikakulam) పట్టణానికి రెండు కిలో మీటర్ల దూరంలో అరసవిల్లి (Arasavilli) అనే గ్రామం కలదు. ఈ గ్రామంలో అతి పురాతనమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్య క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ఉష పద్మినీ ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి (Sri Suryanarayana Swamy) వారు కొలువై ఉన్నారు. పూర్వం ఈ గ్రామాన్నిన్ హర్షవల్లి అనే వారని క్రమక్రమంగా అది అరసవిల్లిగా మారిందని తెలియుచున్నది
ఇక్కడి సూర్యదేవాలయంలో గల ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్టించాడని స్థలపురాణం ద్వారా తెలియుచున్నది. ఇక్కడ లభించిన శాసనాల ద్వారా ఈ సూర్యదేవాలయాన్ని గంగరాజులు నిర్మించి పోషించినట్లు చెప్తారు. ఈ దేవాలయం పక్కన ఉన్న సూర్యగుండాన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది.
శ్రీ మహావిష్ణువు అవతారమైన బలరాముడు ద్వాపర యుగంలో జీవులను ఉద్దరించేందుకు తన నాగేటి చాలుతో నాగావళి నదిని ఆవిర్భవింపచేసి ఆ తీరాన ఒక దేవాలయాన్ని నిర్మించి, అందులో స్వామివారిని ప్రతిష్టించాడు. ఆ వింతను చూడడానికి దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇంద్రుడొక్కడు వేళకు రాలేకపోయాడు
ఎప్పుడో రాత్రి సమయాన కోటీశ్వర దర్శనార్ధం రాగా నందీశ్వరుడు అడ్డుకున్నాడు. ఇంద్రుడు కోపావేశంతో వజ్రాయుధం ఎత్తగా, నందీశ్వరుడు తన కొమ్ములతో ఇంద్రుని విసిరిపారేశాడు. ఆ దెబ్బకు అరసవిల్లి సమీపంలో సృహతప్పి పడిన ఇంద్రునికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై నా విగ్రహం ఇక్కడ ప్రతిష్టించి ఆరాదించామని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆయన చెప్పినట్లే అరసవిల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామిని ప్రతిష్టించి, ఆరాధించి, ఇంద్రుడు ఆరోగ్యవంతుడై తిరిగి తన లోకానికి చేరుకున్నాడని ప్రతీతి.
భక్తులు సూర్య భగవానుని శరణు వేడి, పూజలు, అభిషేకాలు సూర్యనమస్కారాలు చేసి తమ కోర్కెలు ఫలించడంతో హర్ష భరితులై తమ ఇండ్లకు వెళతారు. ఆందుకే ఈ క్షేత్రానికి హర్షవల్లి అనే పేరు వచ్చిందని, అదే వాడుకలో అరసవిల్లి అయిందని అంటారు. ఈ స్వామి వారు నవగ్రహాధిపతి కావడంవల్ల స్వామిని దర్శించినంత మాత్రముననే సర్వగ్రహరిష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, చర్మ వ్యాధి నిరోధకుడని పురాణాలుం చెబుతున్నాయి
ప్రతి సంవత్సరం మార్చ్ 9 నుండి 12 వారు, అక్టోబర్ 1 నుండి 3 తేదీల్లో (ఉత్తరాయణము ,దక్షిణాయణము)ఇక్కడ సుభ్రభాత సమయంలో ఐదు ద్వారాల నుండి సూర్యకిరణాలు ఈ ఆలయంలోని స్వామివారి పదాలను తాకుతాయి. ఆరోగ్యం కోరుకునేవారు, గ్రహబాధలు ఉన్నవారు ఈ స్వామి వారిని సేవిస్తే అన్ని సమస్యలు తీరగలవని భక్తుల నమ్మకం.
ఈ దేవాలయ ముఖమండపంలో సప్తాశ్వారూఢుడయిన సూర్యుని ఏకశిలా విగ్రహము ప్రత్యేక ఆకర్షణ. స్వామివారికి త్రిచ, సౌర,అరుణ ప్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు. అష్టోత్తర శత సహస్ర నామార్చనలు, ప్రతి ఏటా మాస సంక్రాంతి రోజున క్షీరాభిషేకం, ఏకాదశి నాడు కల్యాణ సేవ, ప్రతి ఆదివారం తిరువీధి సేవలు మొదలగునవి నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం రధసప్తమి నాడు స్వామికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఇచ్చట కల్యాణోత్సవము, రధోత్సవం, కృష్ణ నవరాత్రులు, క్షీరాబ్ది ఉత్సవము, సూర్య జయంతి ఉత్సవము, డోలోత్సవం వంటి ఉత్సవాలను అతి వైభవముగా భక్తి శ్రద్ధలతో జరుపుతారు

