కోలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajani Kanth) . ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ (Jailer 2) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే రజనీకాంత్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Hasan) తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు ఇటీవలే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నిర్మాణ సారథ్యంలోనే రానున్న ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి సుమారు 46ఏళ్ల తర్వాత నటిస్తున్నారు. త్వరలోనే ఈ మల్టీస్టారర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం జైలర్–2 చిత్రాన్ని పూర్తిచేసిన రజనీకాంత్ తాజాగా ఆయన 173వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.
అగ్ర నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ (Raj Kamal Film International) పతాకంపై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమాలో రజనీకాంత్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ కథానాయికగా పూజా హెగ్డే (Pooja Hegde) పేరు బలంగా వినిపిస్తున్నది. మరో కథానాయికగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ను తీసుకున్నారని వినికిడి. అయితే వీరిద్దరు సహజంగా పోషించే గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరితో పాటుగా ఈ సినిమాలో ఒక సీనియర్ నటి కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

