‘SSMB29’ రాజమౌళి, మహేశ్‌ మూవీలో మరో సూపర్ స్టార్

by | Mar 4, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్‌ బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో పాటు ముఖ్య తారాగణంపై గత కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్‌ పూర్తవడంతో రెండో షెడ్యూల్‌ కోసం చిత్రబృందం ఆఫ్రికాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. అయితే కొన్ని రోజులుగా మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారనే టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజాగా పృథ్వీరాజ్ చేసిన పోస్టుతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.

పృథ్వీరాజ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ” డైరెక్టర్ గా నేను చేయాల్సిన సినిమాలు చేసేశాను. వాటికి సంబంధించిన ప్రమోషన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు మరోసారి నటుడిగా బిగ్ స్క్రీన్ మీద అలరించేందుకు సిద్ధమయ్యాను. నా సొంత భాషలో కాకుండా మరో భాషలో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కానీ ఆ సినిమాలో నాకు భారీ డైలాగులు ఉన్నాయి. వాటి గురించి తలుచుకుంటే కాస్త భయమేస్తోంది. ” అంటూ పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో సొంత బాష కాని భాషలో అని చెప్పడంతో ఇది రాజమౌళి-మహేశ్ బాబు సినిమా గురించే అని అభిమానులు భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. కాగా, అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు ఇతర భాషల నటులు కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు.