పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో తన. జోరును మరింత పెంచాడు. ఒక సినిమా ముగిశాక మరో సినిమా చేసే పద్ధతిలో కాకుండా ఒకేసారి వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (Fouji) మూవీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2′(Kalki) సినిమాల చిత్రీకరణలో బిజీగా గడుపుతున్నారు. ఇందులో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో ‘సీతారామం’తో ప్రశంసలు అందుకున్న హను రాఘవపూడి, ఈసారి మరింత ఎమోషన్‌తో కూడిన యాక్షన్ డ్రామాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం వరకూ పూర్తయినట్లు తెలుస్తోంది. కేవలం కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉండడంతో వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకొని ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ప్రభాస్ (Prabhas)నటిస్తున్న తదుపరి చిత్రం ‘స్పిరిట్’పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి దిమ్రీ నటిస్తుండగా ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) మధ్య కీలక సన్నివేశాలను దర్శకుడు నాగ అశ్విన్ చిత్రీకరిస్తున్నారు. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. త్వరలోనే ప్రభాస్ (Prabhas) కూడా ఈ సినిమా షూట్‌లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభాస్ దూకుడు పెంచారు. భారీ హంగులతో, అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

