‘వారణాసి’ కోసం హాలీవుడ్‌ను హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారుగా.!

by | Feb 25, 2026 | సినిమా

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. మహేశ్‌బాబు ఇందులో రుద్ర (Rudra) అనే పాత్రలో నటిస్తుండగా.. విలన్‌ ‘కుంభ’గా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, మందానికిగా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కనిపించనున్నారు. ఇక కేఎల్‌ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా, క‌థ విజయేంద్ర ప్రసాద్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ‘మోషన్ క్యాప్చర్’ టెక్నాలజీని ఇప్పుడు హైద‌రాబాద్‌కు తీసుకొచ్చారు. అక్కినేని నాగార్జునకు (Nagarjuna) చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘ఎం&ఎం క్యాప్ ల్యాబ్’ పేరిట ఈ ల్యాబ్ ఏర్పాటు చేయగా.. దర్శకుడు రాజమౌళి దీన్ని ప్రారంభించారు.

అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ తో పాటుగా హాలీవుడ్‌కు చెందిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ సంస్థలు కలిసి అత్యున్నత సాంకేతికతతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాయి. ఇక ‘వారణాసి’ (Varanasi) లోని కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే ఈ ల్యాబ్‌లో చిత్రీకరించినట్లు రాజమౌళి వెల్లడించారు. సినిమాకు ముఖ్యమైన ఈ సన్నివేశాల అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని రాజమౌళి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ‘వారణాసి’ సినిమా ఇప్పటికే సగ భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండాఫ్ కు సంబంధించిన కీల‌క‌ సన్నివేశాలను జార్జియాలో షూట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే హీరో మ‌హేశ్ బాబు (Mahesh Babu) హైద‌రాబాద్ నుంచి జార్జియాకు వెళ్ళారు. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉండడంతో వీలైనంత తొందరగా చిత్రీకరణను పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెలిసిందే