గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీరామినవమి కానుకగా స్పెషల్ అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెద్ది సినిమా నుంచి ఫస్ట్ షాట్‌ను శ్రీరామి నవమి కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 11.45 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా గ్లింప్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి మెగా అభిమానులతో పాటుగా సినీ ప్రియుల్లోనూ నెలకొంది.
అయితే ‘పెద్ది ఫస్ట్ షాట్’ గ్లింప్స్‌పై హీరో రామ్ చరణ్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఇప్పుడే తాను పెద్ది (Peddi) గ్లింప్స్ చూశానని, ఇది వేరే లెవెల్లో ఉందని, అభిమానులను ఫుల్ మీల్స్ ఖాయమని, ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలువనుందని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దింతో ఏప్రిల్ 6న రానున్న పెద్ది గ్లింప్స్ ఏ లెవెల్లో ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Jahnavi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

