సూపర్ హిట్ పెద్ది బుచ్చిబాబు కు విలువైన పాఠాలు నేర్పిందా?

by | Jul 5, 2026 | సినిమా | 0 comments

రామ్ చరణ్ హీరో గా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన పెద్ది సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద హిట్. సోషల్ మీడియా వెబ్సైటు లు మంచి రేటింగ్ లు ఇచ్చినప్పటికీ, పెద్ది సినిమా విడుదలైన మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇంత నెగటివిటీ మధ్య పెద్ది సినిమా ని కేవలం రామ్ చరణ్ తన నటనతో బిగ్గెస్ట్ హిట్ చేశారు. రామ్ చరణ్ నటనను విమర్శకులు కూడా అభినందించారు.

బుచ్చిబాబు కధగా ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంది. ఒక ఆట కూలీ కి ఒక పర్పస్ ని క్రియేట్ చేసి దానికి ఒక మెసేజ్ ని జోడించారు. ఇప్పుడు వస్తోన్న క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ యాక్షన్, ఎలేవేషన్ చిత్రాలకు పూర్తి భిన్నంగా బుచ్చిబాబు ఈ కధను రాశారు. ఇలాంటి కధను రామ్ చరణ్ తో తీయడం అనేది ఒక సాహసం అని చెప్పవచ్చు. ఈ విషయంలో నిర్మాత వెంకట సతీష్ కిలారుని అభినందించవచ్చు.

అయితే పెద్ది సూపర్ హిట్ అయినా అది రామ్ చరణ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. బుచ్చిబాబు కు అంతగా కలిసి వచ్చిందేమీ లేకపోగా విమర్శలను మూట కట్టుకున్నాడు.

బుచ్చిబాబు రాసుకున్న ఈ కధ లో స్పోర్ట్స్ కు సంబందించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు అధికంగానే ఉంటుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి అన్న ఒకే ఒక్క పాయింట్ తో సినిమా బడ్జెట్ ను ఇంకా భారీగా పెంచేశారు.

ఈ నేపథ్యంలో పెద్ది సినిమా ఇంత పెద్ద హిట్ అయినా కూడా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు కు పెద్ది గాడు కొన్ని పాఠాలు నేర్పించాడు.
ఐదు సంవత్సరాలు ఈ సినిమా కధ పై కూర్చున్న బుచ్చిబాబు హీరోయిన్ అచ్చియమ్మ క్యారెక్టర్ ను గొప్పగా మలచడంలో విఫలమయ్యాడు. అంతే కాకుండా ఈ క్యారెక్టర్ ను కధలో అంతర్భాగం చేయడంలో కూడా బుచ్చిబాబు పట్టు తప్పాడు. క్యారెక్టర్ బలంగా రాయలేకపోవడం ఒక తప్పిదం అయితే, జాహ్నవి కపూర్ రాకతో సినిమా బడ్జెట్ పెంచడం మరో తప్పిదం. జాహ్నవి కపూర్ దురదృష్టం ఏంటంటే తన మొదటి సినిమా దేవరలోను, రెండవ సినిమా పెద్ది లోను తన పాత్రలను దర్శకులు బలంగా రాయలేకపోవడం.

అంతే కాకుండా సుకుమార్ శిష్యుడిగా స్పెషల్ పాట పెట్టాలి అన్న తపనతో పెట్టిన శృతి హాసన్ పాట సినిమాకు పెద్దగా బలం చేకూర్చలేదు. పాట బాగుంది. రామ్ చరణ్ డాన్స్ బాగుంది. అయితే అసందర్భంగా వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఒక్కసారిగా కధ నుండి దారి తప్పేలా చేసింది. ఇక్కడ కూడా శృతి హాసన్ పాట ద్వారా సినిమా బడ్జెట్ ను అనవసరంగా పెంచేశారు దర్శకుడు బుచ్చిబాబు.

రావు రమేష్ పాత్ర కూడా కేవలం ఒక్క సన్నివేశంలో చూపించారు. అలాగే కమెడియన్ లు సత్య, చమ్మక్ చంద్ర ల క్యారెక్టర్ లకు కూడా అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. మీర్జాపూర్ సిరీస్ తో పాపులర్ అయిన Divyendu క్యారెక్టర్ కూడా చిత్ర ప్రధమ భాగంలో మాత్రమే ప్రధానంగా కనిపిస్తుంది. పెద్ది జర్నీ లో అప్పడప్పడు కనిపించే బోమన్ ఇరానీ పాత్ర ద్వారా ఖర్చు కూడా బాగా పెరిగింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు ఎవరైనా ఉంటే రామ్ చరణ్ తరవాత జగపతి బాబు, శివ రాజ్ కుమార్ లు మాత్రమే. ఈ ముగ్గురు నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పవచ్చు.

తన రెండవ సినిమానే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో తో చేస్తున్నప్పుడు, అందులోను మెసేజ్ ఓరియెంటెడ్ లాంటి కథ తీసుకున్నప్పుడు కధ, కధనాలలో మరింత వేగం ఉండేలా దర్శకుడు బుచ్చిబాబు జాగ్రత్త పడాల్సింది. ఎంత గొప్ప సందేశం ఇచ్చినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కధ చెప్పగలగాలి. నెగటివిటీ రావడానికి ముఖ్య కారణం పెద్ది సినిమా మొదటి 40 నిమిషాలు నిదానంగా సాగడం. అప్పల సూరి పాత్ర చనిపోయిన తరవాత నుండి సినిమాలో వేగం పెరుగుతుంది. కొత్తగా పెద్ది సినిమాకు యాడ్ చేసిన సన్నివేశాలు కూడా అంత గొప్పగా లేవు.

ఈ సినిమా జాతీయ స్థాయి సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తో ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అయితే రెహ్మాన్ తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి.

ముందుగా అనుకున్నా ప్రకారం మార్చ్ 27 సమ్మర్ హాలిడేస్ కి ముందు వచ్చి ఉంటె ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అయ్యేది. సమ్మర్ సీజన్ చివర్లో రావడం కూడా బుచ్చిబాబు ప్లానింగ్ లోపాలను బయట పెట్టింది. ఎంత పాన్ ఇండియా స్థాయి సినిమా అయినా కధ, కధానాలలో వేగం ఉండాలి. అంతే కాకుండా కధలో దమ్ముంటే పాన్ ఇండియా ఆర్టిస్ట్ లు అవసరం లేదు. మరి ముఖ్యంగా ఎలాంటి వ్యాపారం అయినా విజయవంతం కావాలంటే ఖర్చును అదుపులో పెట్టుకోవాలి.

25 కోట్లతో ఉప్పెన తీసిన వ్యక్తి ఒకేసారి 350 కోట్ల సినిమా తీయడం సాహసం అని చెప్పాలి. అయితే మొదటి సినిమాలో హీరో, హీరోయిన్ లు ఇద్దరు కొత్తవారే. అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టాడు. రెండవ సినిమా రామ్ చరణ్ వంటి స్టార్ హీరో చేత పెద్ది లాంటి పాత్ర చేయించడం మామూలు విషయం కాదు. అయితే రెండు సినిమాల క్లైమాక్స్ లో బుచ్చిబాబు షాక్ లు మాత్రం హైలైట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో బుచ్చిబాబు కూడా పెద్ది లాగా బ్లాక్ బస్టర్.

బుచ్చిబాబు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె ఓవర్సీస్ లో, నార్త్ ఇండియా లో కూడా పెద్ది సినిమా మరింత పెద్ద విజయం సాధించేదేమో.
బుచ్చిబాబు నిజాయితీపరుడు, క్రమ శిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు. బుచ్చిబాబు అద్భుతమైన కధకుడు ఉన్నాడు. అద్భుతమైన దర్శకుడు ఉన్నాడు. పెద్ది సినిమా లో కొన్ని సన్నివేశాలలో వీళ్లిద్దరు కనిపిస్తారు.

బుచ్చిబాబు కు పెద్ది రెండవ సినిమా మాత్రమే. బడ్జెట్ ను అదుపులో పెట్టుకోవడం, క్యారెక్టర్ లను శక్తివంతంగా తయారు రాయడం, సినిమా కధనంలో వేగం ఉండేలా చూసుకోవడం వంటి అంశాలను బుచ్చిబాబు తన తదుపరి సినిమా తీసేటప్పడు దృష్టిలో పెట్టుకుంటే రామ్ చరణ్ చెప్పినట్లు ఇండియా లో టాప్ 5 దర్శకుల జాబితాలో చేరిపోవడం గ్యారంటీ.

మళ్ళీ పుడతామా ఏంటి అని రామ్ చరణ్ అనుకున్నాడేమో, అందుకే పెద్ది లాంటి సినిమాని అంగీకరించడం ఒక ఎత్తు. ఆ పాత్రకు ప్రాణం పోయడం ఒక ఎత్తు.