క్రేజీ కాంబో.. పవన్ కళ్యాణ్ డైరెక్టర్‌తో వెంకీ సినిమా!

by | Mar 28, 2025 | సినిమా

ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాను అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా​ విడుదలై రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో వెంకటేష్ (Venkatesh) నటనకు, కామెడీ టైమింగ్ ​కు అభిమానులు నీరాజనం పలికారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ తర్వాత ఏ దర్శకుడు తో సినిమా చేయనున్నాడు అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం వెంకటేష్‌ స్క్రిప్ట్స్ వినే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘గబ్బర్‌ సింగ్, రామయ్యా వస్తావయ్యా, దువ్వాడ జగన్నాథమ్‌’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరీష్‌ శంకర్‌ (Harish Shankar) ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌గా వెలుగొందారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించాయి. ఈ క్రమంలోనే వెంకటేష్ కోసం ఓ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను వెంకీకి హరీష్ శంకర్ వినిపించాడని సమాచారం. హరీష్ శంకర్ చెప్పిన కథ విషయంలో వెంకటేష్ తో పాటుగా ఆయన అన్నయ్య ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని, వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో 77వ చిత్రంగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా సక్సెస్ లోని లేని హరీష్ శంకర్ ఈ సినిమాతో ఎలాగైనా ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకీ కోసం పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం.