మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ మూవీ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని రూపొందించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హెబ్బా పటేల్, వశిష్ట కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్‌కి, టీజర్ కి అదిరిపోయే స్పందన లభించింది. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 17 న ‘ఓదేల 2’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని ఏప్రిల్ 8న ముంబయ్‌లో జరిగే ఓ ఈవెంట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక వార్తతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ఈ సినిమా సత్తాచాటింది. ‘ఓదేల 2’ను (0dela) పాన్ ఇండియా మూవీగా చిత్ర బృందం తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అదిరిపోయే థియేట్రికల్ డీల్ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో రూ.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాన్-థియేట్రికల్ డీల్ రూపంలో రూ.18 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు కాగా, ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను సుమారు 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలా భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘ఓదెల 2’ మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగియగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో తమన్నా (Tamannah) నాగసాధు పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

