‘డ్రాగ‌న్’ కాదు.. ఎన్టీఆర్ – నీల్ సినిమా టైటిల్ ఇదేన‌ట‌.!

by | Feb 18, 2026 | సినిమా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) , నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జోర్డాన్‌లో జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌పై అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తైన వెంటనే ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒక‌టి ఫిలినగ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్‌ ‘డ్రాగన్’ (Dragon) అని అందరు అనుకున్నారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ మూవీకి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాలీవుడ్ లో పదేళ్ల తర్వాత ఇదే టైటిల్‌తో మరొక సినిమా వచ్చినట్లు అవుతుంది. ఎందుకంటే అంతకుముందు 2015లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడుగా ‘బ్రూస్ లీ: ది ఫైటర్’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కోసం ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలియడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నిర్మాత రవి యలమంచిలి ‘డ్రాగన్’ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, ఫైనల్ టైటిల్ ఇంకా ఖరారు చేయలేదని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ ఏం లేకున్నా.. ఈ క్రేజీ న్యూస్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అలాగే మే 20న ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్‌ ప్రకటన, టీజర్‌ రిలీజ్‌ ఉంటాయని సమాచారం.