మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) , స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో నయనతార (Nayanathara) హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ (Venkatesh) కీలక పాత్రలో కనిపించారు. థియేటర్లలో భారీగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఈసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఇప్పుడు చిరు తదుపరి చిత్రాలపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చిరంజీవి లైనప్లో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ (Viswambhara) దర్శకుడు వశిష్ఠ (Vasistha) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ మూవీపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
గతేడాదే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనుల వలన ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు తుది దశకు చేరుకోవడంతో ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేయాలని భావించిన మేకర్స్.. ఇప్పటివరకు అధికారిక రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం జూలైలో ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 10 లేదా జూలై 24 తేదీలను లాక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో జూలై 24 తేదీకి స్పెషల్ సెంటిమెంట్ కూడా ఉంది. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా కూడా జూలై 24నే విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటివరకూ ఉన్న చిరంజీవి సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 122 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని మెగాస్టార్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ జూలై 24న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

