తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఒక పక్క మంత్రి పదవి.. మరోపక్క గడిచిపోతున్న సమయం.. ఇంకో పక్క సుప్రీం కోర్టు తీర్పులు.. మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ మైండ్! అవును, మనం మాట్లాడుకుంటున్నది మంత్రి అజారుద్దీన్ (Azharuddin) గురించి. అనూహ్యంగా మంత్రి అయ్యారు.. కానీ ఇప్పుడు ఆ పదవి ఉంటుందా? ఊడుతుందా? అన్న టెన్షన్ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. అసలు ఏం జరుగుతోంది? అజారుద్దీన్‌ను గట్టెక్కించడానికి సీఎం రేవంత్ వేసిన ఆ ‘భారీ స్కెచ్’ ఏంటి? ఎవరి పదవికి ఎసరు రాబోతోంది? ఎవరికి రాజ్యసభ యోగం పట్టబోతోంది? ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న అసలు కథను ఒక్కసారి చూద్దాం.. గతేడాది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో, అక్టోబర్ 31న అజారుద్దీన్ (Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది కాంగ్రెస్ తీసుకున్న సంచలన నిర్ణయం. కానీ రాజ్యాంగం ప్రకారం.. మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి, ఆరు నెలల లోపు చట్టసభకు ఎన్నిక కావాలి. ఇప్పటికే మూడున్నర నెలలు గడిచిపోయాయి. అంటే సగం కాలం పూర్తయ్యింది. ఇంకా మిగిలింది కేవలం రెండున్నర నెలలే. ఏప్రిల్ 30 నాటికి డెడ్ లైన్ ముగుస్తుంది. ఈ లోపు ఆయన ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో గెలవకపోతే.. మంత్రి పదవి ‘ఊస్ట్’ అవడం పక్కా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందా? లేదు. ఉన్నదల్లా ఒకే ఒక్క మార్గం.. ‘గవర్నర్ కోటా ఎమ్మెల్సీ’. కానీ అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది.
అసలు ఈ గవర్నర్ కోటాలో ఏం జరిగింది? కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ బీఆర్ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫలితం? ఆ నియామకాలు చెల్లవని కోర్టు చెప్పింది. గత ఏడాది ఆగస్ట్ 30న క్యాబినెట్.. కోదండరాం, అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా (MLC) చేయాలని గవర్నర్‌కు ఫైల్ పంపింది. కానీ పాత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో, ‘తుది తీర్పు వచ్చే వరకు కొత్త నియామకాలు వద్దు’ అని కోర్టు బ్రేక్ వేసింది. ఇప్పుడు అజారుద్దీన్ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్లు తయారైంది. కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఇక్కడ మంత్రి పదవి గడువు ముగిసిపోతోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి.. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొలిటికల్ చాణక్యం బయటపడింది. అజారుద్దీన్‌ను కాపాడుకోవాలి.. అదే సమయంలో కోర్టు చిక్కుల నుంచి తప్పించుకోవాలి. దీనికోసం రేవంత్ ఒక ‘కొత్త ఫార్ములా’ తెరపైకి తెచ్చారని తెలుస్తుంది.. అదేంటంటే.. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’.
ప్రస్తుతం మండలిలో ఉన్న కాంగ్రెస్ (Congress) లేదా మిత్రపక్ష ఎమ్మెల్సీలలో ఒకరి చేత రాజీనామా చేయించడం.
ఆ ఖాళీ అయిన స్థానంలో, ఉప ఎన్నిక ద్వారా లేదా నామినేషన్ ద్వారా అజారుద్దీన్‌ను మండలికి పంపించడం. ఇది జరిగితే కోర్టు గొడవ ఉండదు.. అజార్ మంత్రి పదవి సేఫ్.. కానీ.. ఉన్నఫలంగా ఒక ఎమ్మెల్సీ తన పదవికి ఎందుకు రాజీనామా చేస్తారు? అక్కడే ఉంది అసలు ట్విస్ట్! ఎవరైతే అజార్ కోసం త్యాగం చేస్తారో.. వారికి బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారట సీఎం. అదే.. రాజ్యసభ సీటు. ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.. అజారుద్దీన్ కోసం ఎమ్మెల్సీ పదవిని వదులుకునే ఆ నేత ఎవరు? త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఈ త్యాగం చేసిన వారిని పంపించేలా ప్లాన్ రెడీ అయ్యింది. ఇది పార్టీలో ఎలాంటి చర్చకు దారితీస్తుంది? ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉండి, రాజ్యసభపై ఆశ ఉన్న సీనియర్లు ఎవరు? ఈ మార్పు వల్ల సామాజిక సమీకరణాలు ఎలా మారుతాయి? ఒకవేళ రాజ్యసభ సీటు ఇవ్వకపోతే.. అసంతృప్తి జ్వాలలు ఎగసిపడవా.. అయితే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు సీనియర్ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. వారి పేర్లు బయటకు రాకపోయినా.. అంతర్గత చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ స్కెచ్ గనుక వర్కౌట్ అయితే.. రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారు అటు అజార్‌ను సేవ్ చేసినట్లు అవుతుంది, ఇటు రాజ్యసభకు ఒక బలమైన నేతను పంపినట్లు అవుతుంది. నిజంగా ఇది అద్భుతమైన పొలిటికల్ మూవ్ అని చెప్పాలి. మంత్రి అజారుద్దీన్‌ను గట్టెక్కించేందుకు రేవంత్ రెడ్డి రచిస్తున్న భారీ వ్యూహం ఇది. ఏప్రిల్ 30 లోపు ఏం జరుగుతుందో చూడాలి. అజార్ ఎమ్మెల్సీ అవుతారా? లేక మంత్రి పదవికి గుడ్ బై చెప్తారా? రాజ్యసభకు వెళ్ళే ఆ లక్కీ లీడర్ ఎవరు? ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా ఎన్ని ట్విస్ట్‌లు ఉంటాయో వేచి చూడాలి.

