టాలీవుడ్ లో దర్శకుడిగా సురేందర్ రెడ్డి (Surendar Reddy) కి ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. అతనొక్కడే సినిమా ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేసిన సురేందర్ రెడ్డి ఆ తర్వాత కిక్, రేసుగుర్రం, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఊసరవెల్లి, అతిథి, కిక్-2 లాంటి ఫ్లాప్‌లు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. అయితే ఏజెంట్ వంటి డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 32వ చిత్రంగా తెరకెక్కనుంది. అయితే.. తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఇప్పటికే ప్రభాస్ ఫౌజీలో అవకాశం కొట్టేసిన ఇమాన్వీ హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆ స్థానంలో ఇటీవల ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సాక్షి వైద్య (Sakshi Vaidya) కథానాయికగా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అంతకుముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ సినిమా ద్వారానే సాక్షి వైద్య సినిమాల్లోకి అడుగుపెట్టడం విశేషం. ఇప్పుడు సురేందర్ రెడ్డి మరోసారి ఈ బ్యూటీకే ఓటేసినట్లు సమాచారం.
అయితే ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారా లేక ఒక్కరా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ ఏమిటంటే, ఇందులో పవన్ కళ్యాణ్‌కు తమ్ముడిగా ఒక యువ హీరో నటించే అవకాశం ఉందని, అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఇది ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. కాగా, ఇందులో పవన్ కళ్యాణ్ ను ఇంతకుముందు చూడని అత్యంత స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ లుక్‌లో చూపించబోతున్నారట. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ (Vakkantham Vamsi) ఈ చిత్రానికి పవర్ ప్యాక్డ్ స్క్రిప్ట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి(Ram Thalluri) ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

