టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి (Mega Star Chiranjeevi) తన సతీమణి సురేఖ (Surekha) అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవికి ఏమాత్రం సమయం దొరికినా సురేఖతో ఆనందంగా గడిపేస్తుంటాడు. ఇద్దరు కలిసి విహారయాత్ర వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నేడు సురేఖ పుట్టినరోజు (ఫిబ్రవరి 18న). అలాగే ఫిబ్రవరి 20న వీరి పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్‌ను పంచుకున్నారు చిరు. తన సినీ జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత ప్రయాణంలోనూ తనకు తోడుగా నిలిచిన సురేఖపై తనకున్న అపారమైన ప్రేమాభిమానాలను ఆయన ఈ సందర్భంగా చాటుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్యకు ఎక్స్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి.
“నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖ కు జన్మదిన శుభాకాంక్షలు. 1980 ఫిబ్రవరి 20న సురేఖతో నా వివాహం జరిగింది. ఆనాటి నుంచి తనే నాకు అనునిత్యం అండగా ఉంటూ నాకోసం నిలబడింది. నా కుటుంబసభ్యులను ఎంతో ప్రేమగా చూసుకుంది. ఈరోజు తన పుట్టినరోజు, అలాగే ఇంకో రెండు రోజుల్లో మా పెళ్లి రోజు కూడా రానుండడంతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. మా కుటుంబానికి సురేఖ వెన్నుముక లాంటింది. తన అపారమైన ప్రేమతో మా అందరినీ కట్టిపడేసింది. నాకే కాకుండా నా కుటుంబసభ్యులను కూడా సొంత వారిలా చూసుకుంది. నా తల్లిదండ్రులకు కోడలిగా కాకుండా సొంత కూతురిగా నిలిచింది. నేను ఒక గొప్ప నటుడిగానే కాకుండా ఒక అత్యుత్తమ తండ్రిగా కూడా మారేందుకు కారణం నువ్వే, నా విజయం వెనుక ఉంది నా ప్రతిభ, స్వయంకృషి కాదు, నా విజయానికి నువ్వే ప్రధాన కారణం. ఇంటి బాధ్యతలన్నింటినీ సురేఖ భుజాన వేసుకోవడం వల్లే నేను ఎలాంటి టెన్షన్ లేకుండా నటనపై దృష్టి పెట్టగలిగాను, నిజానికి మెగా ఫ్యామిలీని నిలబెట్టింది నువ్వు, నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే.. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా బలానివి.. నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. నా ప్రతి అడుగులో నా వెంట నడిచిన సురేఖకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ సురేఖతో కలిసిఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేశారు చిరు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ వైరల్ అవుతోంది. అలాగే మెగా ఫ్యాన్స్, సినీరాజకీయ ప్రముఖులు సురేఖ గారికి పుట్టినరోజుతో పాటుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
1

