మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘వార్ 2’ (War 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా, యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా, 2019లో వచ్చిన ‘వార్’ సీక్వెల్ గా ‘వార్ 2’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ (NTR) నెగిటివ్ షేడ్స్ ఉండే స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. హై ఇంటెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం వార్ 2 మూవీ లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) , ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వీరిద్దరూ ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యష్‌రాజ్ స్టూడియోలో ఈ క్రేజీ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
ఇంత మంది డ్యాన్సర్లతో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR) లు నువ్వా నేనా అనే రీతిలో చేసే డ్యాన్స్ సినీ చరిత్రలో మిగిలిపోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన వార్ 2 గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

