నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌ను దూసుకెళ్తోంది. ఇండస్ట్రీలో ‘కోర్ట్’ (Court) మూవీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం రిలీజైన రెండు రోజులకే లాభాల్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే కోర్ట్ సినిమా బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 46.80 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. ముఖ్యంగా 9వ రోజు ఈ సినిమా రూ. 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. శనివారం వీకెండ్ మొదలవడంతో ‘కోర్ట్’ కి భారీగా కలెక్షన్స్ పెరిగాయి. ఇక ఆదివారం ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగి రూ.50 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. మరి సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్స్ ఎలా ఉంటాయో అన్నది చూడాలి. అయితే కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్లోనూ దుమ్మురేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం. తాజాగా ఈ మూవీ యూఎస్ లో 9.5 లక్షల డాలర్స్ మార్క్ ని దాటేసింది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం ముగిసేసరికి 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరే అవకాశముంది. కాగా, కోర్ట్ (Court) మూవీకి ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 8 కోట్లు, ఆడియో ద్వారా రూ. 50 లక్షలు, శాటిలైట్ ద్వారా రూ. 2 కోట్లు వచ్చాయని తెలుస్తోంది.

