ఎన్టీఆర్‌ – నీల్‌ సినిమా.. శ్రీలంకలో భీకర పోరు!

by | Mar 23, 2025 | సినిమా

మ్యాన్ ఎన్టీఆర్ క‌న్న‌డ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్‌, స‌లార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ఇప్పటికే మొదలైంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్స్ లో కీలక సన్నివేశాలు చిత్రికరించారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఈ మూవీ సెట్స్​లో అడుగుపెట్టలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ శ్రీలంకలో చాలా తక్కువ చిత్రాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి లొకేషన్స్ లో ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్‌ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. కానీ ప్రస్తుతం సులువుగానే అనుమతులు లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు శ్రీలంక అధికారుల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ (NTR) ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమయ్యే శ్రీలంక షెడ్యూల్​లో హీరో ఎన్టీఆర్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ ​పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ముగిశాక ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న ‘వార్-2’ మూవీ చిత్రీకరణలో పాల్గొననున్నాడట. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్​ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం.

మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు.