టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం థియేటర్లలో దుమ్మురేపింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 60 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్తో, సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్లో అభిమానులను అలరించింది. ఇక సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘కోర్టు’ (Court) సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుందని దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ఫ్లిక్స్’ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే తమ ఓటీటీ నుంచి రాబోయే సినిమాల జాబితాలో కోర్ట్ సినిమాను చేర్చారు.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి తెలుగతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో అందుబాటులో ఉంటుందని నెట్ఫ్లిక్స్ (Netflix) వెల్లడించింది. కాగా, ‘కోర్ట్’ మూవీ డిజిటల్ రైట్స్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ రూ.8 కోట్లకు దక్కించుకోగా.. విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేసుకుంది. మరి హీరో నాని నిర్మించిన ఈ చిత్రానికి స్మాల్ స్క్రీన్ మీద ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఇక మరోవైపు పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు.

