‘పెద్ది’ vs ‘ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద చెర్రీ – నాని ‘ఢీ’!

by | Apr 7, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. తాజాగా శ్రీరామిన‌వ‌మి కానుక‌గా ‘పెద్ది’ (Peddi) నుంచి ఫ‌స్ట్ షాట్‌ గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో రామ్‌చరణ్‌ పాత్ర ఎలా ఉండనుందో చూపించారు. ‘ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి మళ్లీ’ అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్‌ అదిరిపోయింది. ఈ గ్లింప్స్‌ చివర్లో రామ్ చరణ్‌ కొట్టిన సిక్స్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతుందని గ్లింప్స్‌‍లో ప్రకటించారు.

కానీ దీనికి ముందు రోజే నేచురల్ స్టార్ నాని (Nani) ‘ద ప్యారడైజ్’ (The Paradise) మూవీ వచ్చే మార్చి 26న విడుదల కానుంది. దసరా మూవీ ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌లో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. అంతకుముందు నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం పలు అవార్డులను అందుకోవడంతో ఇప్పుడు రాబోతోన్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఏర్పడాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘ది ప్యారడైజ్‌’ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్‌ వంటి 8 భాషల్లో ఒకేసారి మార్చి 26, 2026న విడుదల కానుంది.

ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు కావడం అలాగే భారీ అంచ‌నాలు కూడా ఈ రెండు సినిమాల‌కు ఉండ‌డంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది. దింతో పాటుగా ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అలాగే పెద్ది దర్శకుడు బుచ్చిబాబు ఇద్దరూ కూడా సీనియర్ దర్శకుడు సుకుమార్ దగ్గర పనిచేసినవారే కావడం విశేషం. ఒకవేళ పోటీ ఏర్పడితే మాత్రం వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో అన్నది చూడాలి.