‘తండేల్’ ఫస్ట్ వీక్​ బాక్సాఫీస్ కలెక్షన్స్​..చైతూ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

by | Feb 14, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జోడీగా నటించిన చిత్రం ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలి రోజే ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

మొదటి రెండు రోజుల్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా అదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. థియేటర్లలో విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకున్న తండేల్ మూవీ ఇంకా తన దూకుడు చూపిస్తూనే ఉంది. ఈ వారం రోజుల్లో మొత్తంగా తండేల్ మూవీ 90 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ పేర్కొంటున్నారు. నాగ చైతన్య కెరీర్‌లో ‘తండేల్’ సినిమానే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం. ఈ వసూళ్ల జోరు చూస్తుంటే నాగచైతన్య కెరీర్లో తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లో చేరిన మూవీగా ‘తండేల్’ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

వాలెంటైన్స్ డే తరువాత వరుసగా శని, ఆదివారాలు రావడంతో ‘తండేల్’ మూవీ కలెక్షన్స్ మరింతగా పెరుగుతాయని ఖచ్చితంగా వీకెండ్‌ ముగిసేసరికి రూ.100 కోట్ల మైలురాయిని చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు.