సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న చిరంజీవి అభిమాని లేఖ

by | Jan 18, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి, నయన తార నటించిన మన శంకర వర ప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా 1980, 1990 ల ఉన్న మెగా అభిమానులు అందరు ఈ సినిమా చూడడానికి థియేటర్లకు వస్తున్నారు.  ఈ సినిమా చూసిన వాళ్ళు అందరు చిరంజీవి నటనకు ఫిదా అవుతున్నారు. 

వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలుకుని, 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.  చూసిన వల్లే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.   తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాలలో తెలుగు వాళ్ళతో పాటు తమిళ, కన్నడ ప్రేక్షకులు కూడా మన శంకర వర ప్రసాద్ గారు చిత్రానికి బ్రహ్మ రధం పడుతున్నారు. ఈ చిత్రంలోని పాటలకు థియేటర్ లోనే డాన్స్ చేస్తున్నారు

మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఐదు రోజులలో 220 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.  నార్త్ అమెరికా లో ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల దిశగా పరుగులు తీస్తోంది

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రవీంద్రనాధ్ శ్రీరాజ్ అనే ఒక అభిమాని రాసిన లేఖ వైరల్ అవుతోంది.  మీరు ఒకసారి చదవండి.

ఓయ్ ప్రసాదూ…..ఇదిగో నిన్నే……

నిన్నేనయ్యా ప్రసాదూ. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా. ఏడు పదుల వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్ రేలు, రక్త పరీక్షలు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాలంలో హుక్కు స్టెప్పు హుక్కు స్టెప్పు అంటూ డాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని నీ ప్లాన్.

అసలు నాకొకటి అర్థం కాక అడుగుతాను. చిన్నప్పుడు యముడికి మొగుడు పాటను బ్లాక్ అండ్ వైట్ టీవీలో గుడ్లప్పగించి చూస్తుంటే మా నాన్న భుజం మీద చరిచి చెప్పేవాడు “ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడే చిరంజీవి అని”. అప్పుడర్థమయ్యేది కాదు.

చెడ్డీలకు బటన్లు ఊడిపోతే పిన్లు పెట్టుకుని స్కూలుకు పరిగెత్తే మధ్య తరగతి జీవితాల్లో బ్లాక్ టికెట్లు కొనే వైరస్ తెచ్చింది నీ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడులే. క్లాసులో బెంచీల మీద నీ డైలాగులు అప్పజెబుతూ టీచర్ కు దొరికిపోతే వీపు మీద కర్ర దెబ్బలు ఎందుకు నొప్పనిపించలేదో తెలుసా. బోలో బోలో బోలో రాణి క్యా చాహీయే అంటూ నువ్వు ఖాకీ కోటుని ఎగరేసి, తిరగేసి డాన్సు చేయడం గుర్తుకు వస్తే మాస్టారి బెత్తం దెబ్బ ఒక లెక్కా.

సరే చిన్నప్పటి ముచ్చట్లు ఇప్పుడెందుకులే ప్రసాదు విషయానికి వద్దాం.ముందు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకో. నీ మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టకు. వాళ్ళు నిన్ను తాత అంటే ఒప్పుకునే పరిస్థితిలో మేం లేం. ఎందుకంటే నువ్వు మాకెప్పటికీ కాళీవి, ఆటో జానీవి, రాజువి, ఇప్పుడీ ప్రసాదువి. అంతే నో డిబేట్. శశిరేఖతో ప్రేమలో పడే సీన్లలో నీలో ఆ పెళ్లి కాని కళని మొహంలోకి ఎలా తీసుకొచ్చావో ఎంత రాకెట్ సైన్స్ చదివినవాడైనా చెప్పలేడు. నా పందెం పది వేలు.

అమాయకత్వం, తింగరితనం కలగలసి నీ టైమింగ్ లో ప్రేక్షకులు మునకలు వేస్తుంటే ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంత సిల్లీగా ఉంటాడానే లాజిక్ మాకెందుకు గుర్తుకు వస్తుంది చెప్పు. గ్రేసుకే బాసులా ఒళ్ళు వయ్యారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతే మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్యా వయసు వ్యత్యాసాన్ని ఎలా గుర్తిస్తాం. అంత చిన్న పిల్లలు ఈ పెద్దాయన ప్రసాద్ కొడుకు కూతురాని నా కొడుక్కు అనిపించలేదంటే దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అనాలా లేక మాస్ భాషలో దొంగ సచ్చినోడు అనాలా నాకైతే అర్థం కాలేదు.

చెప్పుకుంటూ పోతే ఇది ఆగదులే కానీ ఆపేద్దాం. భోళా శంకరప్పుడు నిన్ను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడీ మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసినవాడిని అవుతాను. అందుకే ఇలా బయట పడుతున్నా. చాలా కాలంగా థియేటర్ కు దూరంగా ఉన్న అమ్మా నాన్నను నిన్ను చూసి రమ్మని పంపించా. వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా పది నిముషాలు పొగుడుతూనే ఉంది. ఇంకోసారి చూస్తావా అంటే ఠక్కున ఔననేలా ఉంది. కానీ టికెట్ రేట్లు చూసి వద్దులే అంటుంది. అది వేరే సంగతి. మళ్ళీ మాట్లాడుకుందాం.

సరే ప్రసాదూ. ఇక ఉంటా మరి. నీతో పోల్చుకుంటే ఏజులో రేంజులో బచ్చాగాడిని, ఏకవచనంతో పిలిస్తే నువ్వు ఏమనుకోవు కానీ ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్లకు చెప్పాలిగా. అన్న, నాన్న, తమ్ముడు వీళ్ళను గారు అనడం నాకు తెలియదు. నా ఒంట్లో రక్తాన్ని, గుండెని గారు అని పిలవను. కుటుంబమూ అంతే. మాలో కలిసిపోయిన నువ్వూ అంతే. ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను ఇంకో వంద సినిమాలు చేయమని నేను అడగను. వచ్చినవాళ్లందరికీ భోళాగా మాటిచ్చి సినిమాలు చేయకుండా సత్తా ఉన్నోళ్లకే వరాలు ఇచ్చే వరప్రసాద్ లా ఉండు. అదొక్కటి చాలు.

ఉంటా మరి,

ఇట్లు

నిన్నింకా కలవలేకపోయిన ఒక మాములు అభిమాని.

Ravindranath Sriraj