టాలీవుడ్ యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి, టాలెంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి జంజోడీగా నటించిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నూతన దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 14న భారీ ఎత్తున విడుదలై బ్లాక్ బాస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో నవీన్ పొలిశెట్టి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు తరలిరావడంతో అన్ని చోట్లా షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరుగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కన ఆదివారం నాడు మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రతిరోజూ సగటున రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడుతున్న ఈ సినిమా త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. శనివారం నాటికి ఈ మూవీ 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో నవీన్ పొలిశెట్టి నటించిన ‘జాతి రత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో పాటుగా ‘అనగనగా ఒక రాజు’ సినిమా కూడా 1 మిలియన్ డాలర్ మైలురాయిని చేరుకుంది.


