రేటింగ్: 3.5/5
విడుదల తేది: 12–01–2026
నటీనటులు: చిరంజీవి, వెంకటేశ్, నయనతార, కేథరిన్ థెరిస్సా , సచిన్ ఖేడ్కేర్,శరత్ సక్సేనా, రేవంత్, రఘుబాబు,
హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: సమీర్ రెడ్డి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: తమ్మిరాజు
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
స్క్రీన్ ప్లే, మాటలు: అనిల్ రావిపూడి
దర్శకత్వం: అనిల్ రావిపూడి
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరోయిన్ నయనతార జంటగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలిసారి చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో మూవీ ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీటితో పాటుగా ఇందులో ప్రత్యేక పాత్రలో అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ మెరిశాడు. దాంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. కేథరిన్ థెరిస్సా , సచిన్ ఖేడ్కేర్, శరత్ సక్సేనా, అభినవ్ గోమఠం, హర్ష వర్ధన్, కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ మూవీ ఎలా ఉంది? అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచింది?
చిరంజీవి-అనిల్ రావిపూడి ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? గతేడాది సంక్రాంతికి వెంకీకి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ ఏడాది చిరుకి కూడా అదే రిపీట్ చేశారా? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
శంకరవరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఉంటారు. ఆయన టీమ్‌లో (కేథరీన్ థెరిస్సా, హర్ష వర్ధన్, అభినవ్ గోమఠం) పని చేస్తుండగా.. సెంట్రల్ హోం మినిస్టర్ నితీష్ శర్మ(శరత్ సక్సేనా)కు వీరు సెక్యూరిటీ ఇస్తుంటారు. హోం మినిస్టర్ కూడా శంకర్‌వరప్రసాద్‌ని తన కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఉంటాడు. అయితే బయటకి సంతోషంగా కనిపించే శంకరవరప్రసాద్ వ్యక్తిగత జీవితం మాత్రం సమస్యలతో నిండి ఉంటుంది. అంతకుముందు ఇండియాలోనే రిచెస్ట్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ (నయనతార)ని ప్రేమించి పెళ్లాడతాడు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక ఆతని భార్య శశిరేఖ అతనికి విడాకులిచ్చి తన తండ్రి జీవీఆర్(సచిన్ ఖేడ్కెర్) దగ్గరకు వెళ్తుంది. అలా పిల్లలకి ఆరేళ్లపాటు వరప్రసాద్ దూరమవుతాడు.
ఈ విషయం తెలుసుకున్న హోం మినిస్టర్ నితీష్ శర్మ ప్రసాద్ పిల్లలు చదువుతున్న పాఠశాలలోనే వారికి పీఈటీ టీచర్‌గా వరప్రసాద్‌ని పంపిస్తాడు. ఆ స్కూల్‌లో పీఈటీగా జాయిన్ అయిన శంకర వరప్రసాద్.. తన పిల్లలకు ఎలా దగ్గరయ్యాడు? అసలు వరప్రసాద్, శశి రేఖ ఎందుకు విడిపోయారు? మైనింగ్ బిజినెస్ మెన్ వెంకీ గౌడ(వెంకటేశ్), శశిరేఖకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు వరప్రసాద్, శశిరేఖ ఒక్కటయ్యారా? లేదా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం లేదనే చెప్పొచ్చు. మనస్పర్థలతో విడిపోయిన భార్యకు తానేంటో తెలియజేయాలని ప్రయత్నించే భర్త కథ ఇది. ఈ పాయింట్ చుట్టూ కామెడీ జోడించి అభిమానుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీలో వింటేజ్ మెగాస్టార్ ను చూపించాడు. అద్భుతమైన యాక్టింగ్, గ్రేస్, డ్యాన్స్‌తో చిరు మెగా ఫ్యాన్స్ ను ఉర్రుతలుగించాడు. శంకరవరప్రసాద్‌గా చిరు తనదైన యాక్షన్, కామెడీ, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేశాడు. దాంతో ఫస్ట్ హాఫ్ మొత్తం హాయిగా సాగిపోతుంది. చాలా చోట్ల చిరు తన కామెడీ టైమింగ్‌తో సన్నివేశాలను అద్భుతంగా పండించారు. ఇందులో చిరంజీవికి జంటగా శశిరేఖ పాత్రలో నయనతార అభినయం ఆకట్టుకునేలా ఉంది. చిరు-నయనతార మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. చిరంజీవి టీమ్ మెంబర్స్ గా హర్షవర్థన్, కేథరిన్, అభినవ్ వినోదాన్ని పంచారు. శరత్ సక్సెనా, సచిన్ ఖేడేకర్, సుదేవ్ నాయర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. చిరు తల్లి పాత్రలో జరీనా వాహెబ్ చక్కగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వెంకీ గౌడగా వెంకటేశ్ దుమ్మురేపారు. సెకండాఫ్ లో చిరంజీవి – వెంకటేశ్ కలిసి కనిపించిన సీన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. పాటలో వీరిద్దరూ కలిసి స్టెప్పులేయడం డైలాగ్స్ చెప్పడం మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. సినిమాకు భీమ్స్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. ఈ సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
చిరు నటన
కామెడీ
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
కొత్తదనం లేని కథనం

