తెలుగు చిత్రసీమలో ఎందరో నటులు ఎన్నో పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారన్న సంగతి తెలిసిందే. అయితే తెరపై శంకరుడిగా మెప్పించి ఆ పాత్రలో జీవించిన నటులు కొందరే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు (ఫిబ్రవరి 15) మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, ఇప్పటివరకూ తెలుగుతెరపై భోళాశంకరుడి పాత్రలో కనిపించిన హీరోలు, సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం. రాముడు, కృష్ణుడు, శివుడు వెంకటేశ్వరస్వామి ఇలా పౌరాణిక పాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆర్ (NTR) . ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’, ‘దక్షయజ్ఞం’ వంటి సినిమాల్లో ఆయన శివుడిగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు (ANR) శివుడిగా ‘మూగ మనసులు’ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అలా కనిపించి అలరించారు.
అలాగే శోభన్ బాబు (Sobhan Babu) ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శివుడిగా కనిపించగా.. ‘శ్రీ వినాయక విజయం’ సినిమాలో కృష్ణంరాజు, ‘మావూర్లో మహాశివుడు’ చిత్రంలో రావు గోపాలరావు, ‘శ్రీ సత్యనారాయణస్వామి’ సినిమాలో సుమన్ త్రినేత్రుడి పాత్రలో మెప్పించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘శ్రీ మంజునాథ’ (Sri Manjunadha) చిత్రంలో శివుడిగా ఆ పాత్రలో జీవించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో పరమశివుడిగా మెగాస్టార్ తన ఆహార్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాడు. చిరు చేసిన శివ తాండవం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అంతకుముందు ‘పార్వతీ పరమేశ్వరులు’, ‘ఆపద్భందవుడు’ సినిమాల్లోనూ కొన్ని సీన్స్‌లో చిరు శివుడిగా మెప్పించగా.. ఆ తర్వాత ‘జగద్గురు ఆదిశంకర’ లో చిరంజీవి (Chiranjeevi) మరోసారి శివుడిగా కనిపించారు. ఇక జంధ్యాల తెరకెక్కించిన ‘సీతారామ కళ్యాణం’లోని ఒక పాటలో శివుడిగా కనిపించారు బాలకృష్ణ (Bala Krishna) . అలాగే ‘ఢమరుకం’లో ప్రకాశ్ రాజ్ శివుడిగా అలరించగా.. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ మహాశంకరుడి పాత్రలో కనిపించారు. ఇలా ఎంతో మంది నటులు వెండితెరపై శివుడి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.

