మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే జోష్ లో ఇప్పుడు చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ (Bobby)తో చేయనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమా మార్చిలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా 158 సినిమాలో చిరంజీవి కుమార్తెగా ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ (Anasvara Rajan) ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మొదట కృతి శెట్టి పేరు వినిపించగా, తర్వాత బాలనటి నుంచి హీరోయిన్‌గా మారిన సారా అర్జున్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే ఈ కథలో కూతురు పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో అనస్వర రాజన్ నటన సినిమాకు మరింత బలం చేకూర్చనుందని టాక్ వినిపిస్తోంది. ఇందు కోసం ఇప్పటికే అనస్వరతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ విషయాన్ని త్వరలోనే రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా 158 సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. అనస్వర రాజన్ 2017లో మలయాళంలో విడుదలైన ‘ఉహరణం సుజాత’ ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించారన్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘ఛాంపియన్’ (Champion) తో సూపర్ హిట్ అందుకున్న ఆమె ‘మెగా 158’ (Mega 158) లో ఛాన్స్ కొట్టేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఇక ఈ ప్రాజెక్ట్ కు ఏఆర్ రెహమాన్ ని సంగీతం కోసం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

