టాలీవుడ్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే సినిమాతో బిజీగా ఉన్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలే కాకుండా సిద్ధు జొన్నలగడ్డ దగ్గర ‘బ్యాడ్ యాజ్’, ‘కోహినూర్’ వంటి కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కించే అవకాశముంది. అలాగే డీజే టిల్లు ఫ్రాంచైజీలోని ‘టిల్లు క్యూబ్’ (Tillu Qube) మూవీ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశముంది.
అయితే తాజాగా మరో క్రేజీ దర్శకుడితో సిద్ధు జొన్నలగడ్డ చేతులు కలపబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు హసిత్ గోలీతో సిద్ధు సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు (Dil Raju) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కంటెంట్‌కు పెద్ద పీట వేసే ఈ బ్యానర్‌లో సిద్ధు – హసిత్ గోలీ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆటోమేటిక్‌గా పెరిగిపోయాయి. ఇక ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన సిద్ధు జొన్నలగడ్డ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ, తనదైన నటనతో ముందుకు వెళ్తున్నన్నాడు. ఇక ఈ మూవీ పూర్తిగా కొత్త జానర్‌లో ఉండబోతోందట. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ పాత్ర ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన పాత్రలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. కామెడీతో పాటు యాక్షన్స్ మోమెంట్స్, హసిత్ గోలీ మార్క్ ట్విస్టులు కథలో కీలకంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. సిద్ధు డైలాగ్ టైమింగ్‌కు హసిత్ గోలీ మార్క్ టేకింగ్ కలిస్తే ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ పడటం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

