‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా రివ్యూ : లడ్డు గాడి పెళ్లి గోల

by | Mar 28, 2025 | సినిమా రివ్యూ

విడుదల తేది: 28–03–2025
నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, సత్యం రాజేష్, మురళీధర్ గౌడ్, విష్ణు ఓఐ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: షామ్ దత్
సంగీతం: భీమ్స్​ సిసిరీలియో, తమన్
నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్య
సమర్పకులు: నాగవంశీ
ఎడిటింగ్: నవీన్ నూలి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కల్యాణ్‌ శంకర్‌

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుంది అనే నమ్మకం సినీ ప్రియుల్లో నిండిపోయింది. దాంతో పాటుగా సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా రావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో, తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉగాది కానుకగా ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది మ్యాడ్ తరహాలోనే ఆడియన్స్ ను మెప్పించిందా? సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌లు మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారా?వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

కాలేజీ ముగిసిన చాలా రోజుల తర్వాత కొందరు స్నేహితులు మళ్లీ ఒకచోట కలిస్తే వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. ఈ సినిమా కథ అలానే ఉంటుంది. ఇందులో లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్‌ స్క్వేర్‌ మూవీ మొదలవుతుంది. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్), లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్‌ అయిపోయిన తర్వాత దూరమవుతారు. కానీ, జీవితంలో సెటిల్‌ అవకుండా ఎంజాయ్‌ చేస్తూ గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే లడ్డు(విష్ణు) తన మిత్రులకు చెప్పకుండానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ విషయం తెలిసిన అతని స్నేహితులు పెళ్లి జరిగే సమయంలో మూకుమ్మడిగా అక్కడికి చేరుకుంటారు. నిజానికి లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని ఉద్దేశ్యంతో అతని తండ్రి మురళీధర్ గౌడ్‌ ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లికి రెడీ చేస్తాడు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న లడ్డు స్నేహితులు అతడి పెళ్లి ఘనంగా చేయాలని రకరకాలుగా ప్లాన్స్‌ వేస్తుంటారు. ఈ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే పెళ్లి అయే సమయంలో లడ్డు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఒక వ్యక్తితో పారిపోతుంది. దింతో లడ్డు కుటుంబం బాధలో మునిగిపోతుంది. దీంతో లడ్డును కొంచెం రిలాక్స్‌ చేయాలని అతని స్నేహితులు గోవాకు వెళ్తారు. అయితే వారు గోవా వెళ్ళగానే అక్కడి మ్యూజియంలో ఉన్న విలువైన చైన్ ను మ్యాక్స్‌ (సునీల్‌) దొంగలిస్తాడు. అయితే ఆ దొంగతనం లడ్డు స్నేహితులు చేశారని పోలీసులు వారిని అనుమానిస్తారు. ఈ క్రమంలోనే ఆ చైన్ అనుకోకుండా లడ్డుకి దొరుకుతుంది. దీంతో దానిని తనకి తీసుకొచ్చి ఇవ్వాలని లడ్డు నాన్నని మ్యాక్స్‌ గ్యాంగ్ కిడ్నప్ చేస్తాడు. వీరి కోసం ఒక పోలీస్ అధికారిని గవర్నమెంట్ నియమిస్తుంది. అసలు లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరితో ఎందుకు వెళ్లిపోయింది? లడ్డు గ్యాంగ్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఎవరు? చివరికి ఆ చైన్ ఎవరికి దక్కింది ? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:

‘మ్యాడ్’ సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ కల్యాణ్ శంకర్ దానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ తీసి తన మార్క్ చూయించారు. కథ లేకున్నా కథనం చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ ఈ సినిమాను నడిపించారు. కొన్ని సీన్స్ ఊహించని విధంగా ఆకట్టుకుంటే, మరికొన్ని మాత్రం ఉహించినట్టే సాగాయి. యూత్ ను దృష్టిలో ఉంచుకొని ఫుల్‌ కామెడీతో సినిమా సాగుతుంది. ఎక్కడ అసభ్యతకు తావులేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్‌ శంకర్. మ్యాడ్ సినిమాలో మాదిరిగానే నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు త‌మ పాత్ర‌ల్లో అల‌రించారు. లడ్డూ నాన్న పాత్రలో మురళీధర్ గౌడ్ మెప్పించారు. విలన్ గా సునీల్, కీలక పాత్రల్లో శుభలేఖ సుధాకర్, మోనికా రెబ్బా జాన్ ఆకట్టుకున్నారు. ఇతర కమెడియన్స్ గా సత్యం రాజేష్, రఘుబాబు బాగానే నవ్వించారు. ప్రియాంక జవల్కార్‌ ఎంట్రీ కూడా మెప్పించింది. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ మరోసారి గెస్ట్ రోల్ లో అలరించాడు. ఉన్నకొద్దిసేపు కడుపుబ్బా నవ్వించాడు. భీమ్స్ సిసిరీలియో సాంగ్స్ తో అదరగొట్టగా.. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో దుమ్మురేపారు. నవీన్ నూలీ ఎడిటింగ్ ఆకట్టుకుంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. చిత్ర నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కామెడీ
సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు, మురళీధర్ గౌడ్ నటన
లడ్డు పెళ్లి ట్రాక్

మైనస్‌ పాయింట్స్‌:
సెకండాఫ్ లో కొన్ని సీన్స్

రేటింగ్: 3/5