‘జాట్’ – తొలి రోజు వరల్డ్​ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?

by | Apr 11, 2025 | సినిమా

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్‌, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘జాట్‌’. ఈ సినిమాతో సన్నీడియోల్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సయామీ ఖేర్ హీరోయిన్ గా నటించగా.. విలన్ పాత్రలలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ నటించారు. రెజీనా కసండ్రా కీలక పాత్రలో నటించింది. ఇందులోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్టెప్పులేసింది. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎస్‌ థమన్ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. భారీ అంచనాలు నడుమ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ డే రూ.11.6 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇందులో రూ. 9కోట్ల వసూళ్లు ఇండియాలో సాధించగా.. రూ. 2 కోట్ల వసూళ్లు ఓవర్సిస్ లో రాబట్టింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా షేర్ చేసింది. అయితే జాట్ మూవీ తొలిరోజు రూ.11.6 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు వసూలు చేసినప్పటికీ.. సన్నీ డియోల్ గత సినిమా ‘గదర్ 2’తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘గదర్ 2’ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.40 కోట్లు కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. ఇక జాట్ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కాగా.. తెలుగు వర్షన్‌ డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో హిందీతో పాటుగా తెలుగులో ఈ సినిమాను విడుదల కాలేదు. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఒకేసారి విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నించినా డబ్బింగ్ పనులు పూర్తి కాకపోవడంతో తెలుగు వర్షన్‌ వాయిదా పడింది. అయితే జాట్ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17న విడుదల కానున్నట్లు సమాచారం.