శ్రీలంక మాస్టర్స్ పై ఇండియన్ మాస్టర్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025 లో భాగంగా ఇండియన్ మాస్టర్స్, శ్రీ లంక మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మాస్టర్స్ ఇండియన్ మాస్టర్స్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ మాస్టర్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 4 వికెట్ల నష్ఠానికి 222 పరుగులు చేసింది.
కెప్టెన్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) , అంబటి రాయుడు (Rayudu) ఓపెనర్లు గా దిగారు. రాయుడు 5 పరుగులు, సచిన్ 10 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు. అయితే ఆ తరవాత వచ్చిన గురుకీరత్ సింగ్, బిన్నీ మూడవ వికెట్ కు 87 పరుగులు జోడించిన తరవాత 44 పరుగుల వద్ద గురుకీరత్ సింగ్ అవుట్ అయ్యాడు. ధాటిగా ఆడిన బిన్నీ 31 బంతుల్లో 68 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన యువరాజ్ సింగ్(Yuv Raj Sing), యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) ఐదవ వికెట్ కు అజేయంగా 76 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
22 బంతులు ఆడిన యువరాజ్ 31 పరుగులు చేయగా, 22 బంతులు ఆడిన యూసఫ్ పఠాన్ 56 పరుగులు చేశాడు
శ్రీ లంక బౌలర్ల లో లక్మల్ రెండు వికెట్లు తీయగా, ఉదాన, చతురంగ చెరో ఒక వికెట్ తీశారు
అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీ లంక మాస్టర్స్ మొదట్లోనే 10 పరుగులు చేసిన ఓపెనర్ తరంగ వికెట్ ను కోల్పోయింది
కెప్టెన్ కుమార సంగక్కర తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరిస్తూ 30 బంతుల్లో 51 పరుగులు చేసి ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
తిరుమానె 24 పరుగులు చేయగా, చతురంగ డే సిల్వా డక్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ప్రియాంజిన్ కూడా 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తరుణంలో గుణ రత్నే, జీవన్ మెండిస్ ల పోరాట పటిమతో మళ్ళీ శ్రీ లంక మాస్టర్స్ గెలుపు ముంగిట్లోకి వచ్చింది.
వీరిద్దరూ ఆరవ వికెట్ కు 68 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు చిగురింప చేశారు.
అయితే ధాటిగా ఆడే క్రమంలో జీవన్ మెండిస్ 17 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ఉదాన, గుణరత్నే తో కలిసి ఏడవ వికెట్ 26 పరుగులు జోడించారు. ధాటిగా ఆడిన ఉదాన 7 బంతుల్లో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
19 వ ఓవర్ లో ఉదాన ని వినయ్ కుమార్ అవుట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ మాస్టర్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 20 ఓవర్ అభిమన్యు మిథున్ కి ఇచ్చాడు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో, గెలవడానికి శ్రీ లంక మాస్టర్స్ ఆఖరి ఓవర్ లో 9 పరుగులు చేయాల్సి ఉంది .
అయితే అభిమన్యు మిధున్ ఆఖరి ఓవర్ లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అప్పటి దాకా నిలకడగా ఆడుతున్న గుణరత్నే 37 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో ఇండియన్ మాస్టర్స్ గెలుపు ఖాయమైంది.
20 ఓవర్ల లో శ్రీ లంక మాస్టర్స్ 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇండియన్ మాస్టర్స్ బౌలర్ల లో ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీయగా, ధవళ్ కులకర్ణి, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు
31 బంతుల్లో 68 పరుగులు చేసిన బిన్నీ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు

