పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హరిహరవీరమల్లు మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ వారంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి ఇబ్బంది లేకుండా ఉండేలా ఆయన నివాసంలోనే ప్రత్యేకంగా డబ్బింగ్ స్టూడియోను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మరో 15 డేట్స్ ఇస్తే సినిమా మొత్తం పూర్తవనున్నట్లు సమాచారం. ఇక భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో మే 9న విడుదల కానుంది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ (Hari Hara Veera Mallu) పేరుతో విడుదల కానుంది. ఇక మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు.

