ఘాజీ’ డైరెక్టర్‌తో గోపీచంద్.. ఇండస్ట్రీని షేక్‌ చేయడం పక్కా!

by | Mar 10, 2025 | సినిమా

చిత్రసీమలో ‘ఐబీ 71’, ‘ఘాజీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంకల్ప్‌ రెడ్డి (Sankalp Reddy) హీరో గోపీచంద్‌ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. గోపిచంద్ కెరీర్ లో 33వ చిత్రంగా ఇది రానుండగా… శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీచంద్‌ కెరీర్‌లోనే ఇది విభిన్నమైన కథ అని వినికిడి. పిరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాను 7వ శతాబ్దానికి చెందిన ఓ ఆసక్తికరమైన చారిత్రక సంఘటన ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో గోపీచంద్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ (Gopichand) జోడీ కట్టడం విశేషం. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకు పేరొందిన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా.. ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు సోమవారం నాడు హైద్రాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమానికి హీరో గోపిచంద్(Gopichand) ,దర్శకుడు సంకల్ప్ రెడ్డితో పాటుగా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో బాగమయ్యే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబోలో మూవీ రానుండడంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇండస్ట్రీ హిట్ పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.