టాలీవుడ్లో మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా పూరీ జగన్నాథ్‌కు గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. ఆయన గత సినిమాలైన లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తెలిపోవడంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. అయితే.. పూరీ తర్వాతి సినిమా ఏ హీరోతో అనేది మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా ఈ విషయంపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుందట. పూరీ, గోపీచంద్ కలిసి 2010లో ‘గోలీమార్’ సినిమా చేశారు. ప్రియమణి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను.. బెల్లంకొండ సురేష్ బాబు నిర్మించాడు. 2010లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ విడుదలైన 15 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
‘గోలీమార్’లో హీరో క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది. గోపీచంద్ ఇందులో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించారు. దానిచుట్టూ కొత్త కథను నడపొచ్చని పూరీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ సాలిడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయగా.. హీరో గోపిచంద్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు గోపీచంద్ ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డితో సినిమా చేయనున్నారని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కథా సంబంధమైన చర్చలు తుది దశలో ఉన్నాయని తెలుస్తోంది.

