విడుదల తేది: 14–3–2025
నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: దినేష్ పురుషోత్తమన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
నిర్మాత: ప్రశాంతి త్రిపిరినేని
దర్శకత్వం: రామ్ జగదీష్
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వర్సెస్ ఏ నోబడీ అనేది ఉపశీర్షిక. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మించారు. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ‘కోర్ట్’ మూవీ నచ్చకపోతే నా ‘హిట్ 3’ మూవీ చూడకండి అంటూ హీరో నాని సంచలన కామెంట్స్ చేయడంతో ఈ సినిమాకు ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిర్మాతగా నాని సక్సెస్ అయ్యాడా ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథంతా విశాఖపట్నంలో 2013 ఏడాదిలో సాగుతుంది. అక్కడ చంద్రశేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిలై పార్ట్‌టైమ్ జాబ్స్ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే, ఇంటర్ చదువుతున్న జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. అది కాస్త జాబిలి ఇంట్లో తెలియడంతో జాబిలి మామయ్య మంగపతి (శివాజీ) కోపంతో రగిలిపోతాడు. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు బయటపడ్డాడా ? లాయర్ సూర్యతేజ (ప్రియదర్శి) ఈ కేసుకు ఎలాంటి సహాయం అందించాడు ? అసలు పోక్సో చట్టం ఎలా దుర్వినియోగం అవుతుంది ? ఆఖరికి చందుని ఎలా బయటకు తీసుకు వచ్చారు ? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
నిజానికి ఈ సినిమాలో కథ, కథనం చాలా బాగున్నాయి. బాలికల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్. పోక్సో చట్టం మీద దర్శకుడు ఎక్కు పెట్టిన విమర్శలతో పాటుగా చట్టంలోని లొసుగులను ప్రశ్నించిన తీరు బావుంది. దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సున్నితమైనది కావడంతో చాలా హుందాగా చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. యువకుడిపై పోక్సో కేసు పెట్టిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ కుర్రాడిని బయటికి రాకుండా చేసే న్యాయవాది దాము(హర్ష వర్ధన్) పాత్రలో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. అతనిలో అత్యుత్తమ నటుడు ఉన్న సంగతి మల్లేశం, బలగంతో నిరూపితమైంది. ఇప్పుడు కోర్టు మూవీతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో జీవించాడు. కోర్టులో అతని వాదనలు ఆకట్టుకున్నాయి. కోర్టులో జరిగే వాదనలు, అక్కడి పాత్రలు, డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఆసక్తికరంగా సాగాయి. క్లైమాక్స్‌లో పోక్సో చట్టం గురించి ప్రియదర్శి చెప్పే మాటలు సైతం ఆలోచన కలిగిస్తాయి. హర్ష రోషన్ చందు పాత్రలో ఆకట్టుకున్నాడు. జాబిలిగా శ్రీదేవి చక్కగా నటించింది. ఈ సినిమాలో శివాజీ విలన్ గా ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ కోపం కలుగుతుంది. ప్రేక్షకులకు భావోద్వేగాలు కలిగించడంలో దర్శకుడు విజయం సాధించాడు. సాయి కుమార్ పాత్ర చాలా హుందాగా ఉంది. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అలాగే వడ్లమాని శ్రీనివాస్, సురభి ప్రభావతి పాత్రలకు న్యాయం చేశారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. సినిమా నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరగా కోర్ట్ సినిమాపై నాని పెట్టుకున్న నమ్మకం చెప్పిన మాటలు రెండూ నిజమయ్యాయి.
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
భావోద్వేగాలు
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
ఆసక్తి రేకెత్తించని లవ్ ట్రాక్
రేటింగ్: 3/5

