హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్ని పోషించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఈ చిత్రం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం(Brahmanandam) , రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడుగా నటించారు. చిన్నపుడే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మానందం (రాజా గౌతమ్) థియేటర్ ఆర్టిస్ట్ గా చేస్తుంటాడు. నాకోసం నేను అనే స్వార్థంతో బ్రతికే బ్రహ్మానందం ఎప్పటికైనా పెద్ద నటుడు అవ్వాలనే కోరికతో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ మిత్రుడు గిరి (వెన్నెల కిషోర్) సాయంతో జీవితాన్ని వెళ్ళదిస్తుంటాడు. మరోవైపు బ్రహ్మానందం తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. ఈ క్రమంలోనే బ్రహ్మానందం రాసిన నాటకం జాతీయ స్థాయిలో థియేటర్ ఆర్టిస్ట్ కాంపిటేషన్ లో ఎంపికవుతుంది. దానికి డిపాజిట్ కింద రూ. 6 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం బ్రహ్మనందం ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరమవుతుంది. ఈ నేపథ్యంలోనే బ్రహ్మానందం తాత ఆనంద్ రామ్మూర్తి తన దగ్గర భూమి ఉందని తాను చెప్పినట్టు చేస్తే ఆ రూ.6 లక్షల డబ్బులు తాను ఇస్తానంటాడు. దాంతో బ్రహ్మానందం, ఆనంద్ రామ్మూర్తి ఇద్దరూ తమ సొంత ఊరికి వెళతారు. అక్కడికి వెళ్ళాక ఇంటర్వెల్ కి ముందు ఆనంద్ రామ్మూర్తి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సినిమా మలుపు తిరుగుతుంది. ఆ ఊహించని ట్విస్ట్ తో బ్రహ్మానందం ఊరిలోనే చిక్కుకుపోవడం, ఆనంద్ రామ్మూర్తి కోసం బ్రహ్మానందం (Brahmanandam) ఏం చేసాడు, ప్రేమించిన అమ్మాయ బ్రహ్మానందానికి దక్కిందా ? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

