ప్రభాస్ ఎఫెక్ట్.. దెబ్బతో ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మూవీకి బ్రేక్‌ ఈవెన్‌!

by | Feb 23, 2026 | సినిమా

ప్రభాస్ తన కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా తనకు కావాల్సిన వారి కోసం సమయం కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు ‘వర్షం’ లాంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ (Couple Friendly) సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు ప్రభాస్ (Prabhas) . ఈ చిత్ర బృందంతో దాదాపుగా గంట పాటు ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో తాను పాన్ ఇండియా స్టార్ అనే విషయాన్ని కూడా ప్రభాస్ పక్కన పెట్టేశాడు. చిత్ర యూనిట్‌తో సరదాగా చిట్‌చాట్‌ చేస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌ శోభన్‌, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్‌ ఫ్రెండ్లీ.’ అశ్విన్‌ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మించింది.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకురాగా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది. దాదాపు రూ. 7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ. 6.80 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విజయవంతంగా బ్రేక్‌ ఈవెన్‌ పూర్తి చేసుకుంది. నిజానికి ప్రభాస్ ఇంటర్వ్యూ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. దాంతో ఈ వీకెండ్‌లో చాలా థియేటర్స్‌ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూసి ఆ ఫీల్‌ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ప్రభాస్‌ అన్నారు. అలాగే ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ చూస్తుంటే తనకు గీతాంజలి సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగిందని, అందుకే ఈ సినిమాను నాలుగుసార్లు చూడాలనుకుంటున్నానని ప్రశంసించారు. తనకు వ‌ర్షం సినిమా ఎంత ప్రత్యేకమో… సంతోష్ శోభన్‌కు ‘కపుల్ ఫ్రెండ్లీ’ కూడా అంతే ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ తో పాటుగా యూత్‌కు కనెక్ట్ అయ్యే ప్రేమకథ, సహజమైన నటన, సంగీతం అన్నీ క‌ల‌గ‌ల‌సి ఈ చిత్రాన్ని థియేటర్లలో మంచి రన్ వైపు తీసుకెళ్తున్నాయి.