బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఛావా’పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఛావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరాఠీ సాహిత్యం ఎన్నో కళలకు పుట్టినిల్లు వంటిది. ఛావాలో విక్కీ కౌశల్ నటన అద్బుతం. శంభాజీ మహరాజ్ పాత్రలో జీవించాడు. మహారాష్ట్ర ప్రజలు కేవలం హిందీ సినిమాలనే కాకుండా మరాఠీ సినిమాల స్థాయి పెంచడంలోనూ విజయం సాధించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ‘ఛావా’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ. 297 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ. 500 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నాయి. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

