కామారెడ్డి నిప్పుల కొలిమిలా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ! ఒకవైపు బీజేపీ (BJP) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Venkata Ramana Reddy) .. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) . సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. చివరకు కారు దగ్ధం వరకు వెళ్ళింది. ఇది కేవలం రాజకీయ పోరాటమా? లేక భూముల వెనుక పెద్ద స్కామ్ ఉందా? అసలు మహేందర్ రెడ్డి కారును ఎందుకు తగలేశారు? పూర్తి వివరాలు చూద్దాం. కామారెడ్డిలో ఈ మంటలు ఈరోజే మొదలవ్వలేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు, అరోరా కాలేజీ స్థలాలు, అలాగే శిశు మందిర్ పాఠశాల భూములకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గట్టిగా సవాల్ విసిరారు.. ‘దమ్ముంటే సాక్ష్యాలతో చర్చకు రండి’ అని. శనివారం ఉదయం 10 గంటలకు శిశు మందిర్ దగ్గర కలుద్దామని టైమ్ ఫిక్స్ చేశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యే సవాల్‌ను స్వీకరించి కాంగ్రెస్ (Congress) నేతలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్లారు. మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి (Mahendar Reddy) కారులో దూసుకొచ్చారు. అక్కడే అసలైన యుద్ధం మొదలైంది. బీజేపీ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేయడమే కాకుండా.. రోడ్డుపై పల్టీలు కొట్టించి, నిప్పు పెట్టారు. పోలీసులు ఆపాలని చూసినా ఆగలేదు. చూస్తుంటే ఇది పక్కా ప్లాన్డ్ అటాక్‌లా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. జిల్లా అంతటా 144 సెక్షన్ తరహాలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. షబ్బీర్ అలీ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వం ఈ భూముల విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఈ గొడవ వల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి. రాజకీయాల్లో సవాళ్లు విసురుకోవడం సహజం.. కానీ ఇలా ప్రజా ఆస్తులను, వ్యక్తిగత వాహనాలను తగలబెట్టడం ఎంతవరకు సమంజసం? కామారెడ్డి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన నేతలు ఇలా వీధి పోరాటాలకు దిగడం వల్ల ఎవరికి లాభం? ఈ గొడవ వెనుక ఉన్న ఆ ‘భూముల’ అసలు విలువ ఎంత? అధికారులు ఎందుకు నిజాలు బయటపెట్టడం లేదు? ఇప్పుడు మెయిన్ పాయింట్‌కి వద్దాం. ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ చేసిన ఆ మూడు భూముల కథ ఏంటి? పాయింట్ 1: ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు – ఎవరి చేతుల్లో ఉన్నాయి..మొదటిది.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భూములు. వినడానికి ఎంత బాగుందో కదా? కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే.. అక్కడ కొంత భూమిని ఎమ్మెల్యే అనుచరులు లేదా ఆయనకు అనుకూలంగా ఉన్నవారు ఆక్రమించుకున్నారని. దీనికి కౌంటర్‌గా ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు? ‘నేను ఒక్క గజం ఆక్రమించినా రాజీనామా చేస్తా.. డాక్యుమెంట్లు పట్టుకొస్తా.. మీరు రండి’ అని సవాల్ చేశారు.
అసలు సర్వే నంబర్లు ఏం చెబుతున్నాయి.. రెవెన్యూ అధికారులు ఈ విషయంలో ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు?
ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయితే.. ఇన్ని రోజులు అధికారులు నిద్రపోతున్నారా? లేక అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గుతున్నారా.. వందల కోట్ల విలువైన ఈ భూమి చుట్టూ ఇప్పుడు కంచెలు కాదు.. రాజకీయ గోడలు నిర్మిస్తున్నారు. పాయింట్ 2: అరోరా కాలేజీ & శిశు మందిర్ – లీగల్ చిక్కుముడులు! ఇక రెండోది.. అరోరా కాలేజీ భూముల పంచాయతీ. ఇది పక్కా లీగల్ ఫైట్ అని ఎమ్మెల్యే వాదన. దీని వెనుక పెద్ద స్కామ్ ఉందని కాంగ్రెస్ ఆరోపణ. ఇక్కడ ఒక లాజిక్ ఉంది.. సాక్ష్యాలు చూపిస్తానని ఎమ్మెల్యే గారు శిశు మందిర్ దగ్గరకు రమ్మన్నారు. కానీ పోలీసులు ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. ఒకవేళ ఎమ్మెల్యే దగ్గర నిక్కచ్చిగా సాక్ష్యాలు ఉంటే.. వాటిని బయటపెడితే తప్పు ఎవరిదో తేలిపోయేది కదా? ఆయన్ని ఎందుకు అడ్డుకున్నారు? మరోవైపు, శిశు మందిర్ లాంటి విద్యాసంస్థల భూముల్లో రాజకీయ చర్చలు ఏంటి? అది పవిత్రమైన స్థలం కదా? కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరకు వెళ్లడం ద్వారా ఈ గొడవను కావాలనే ‘క్యాంప్ ఆఫీస్’ వైపు మళ్లించారా? చర్చ కంటే రచ్చే ముఖ్యమా..
అసలు సిసలైన ప్రశ్న ఇక్కడ ఉంది. పోలీసులు ఎమ్మెల్యేను హౌజ్ అరెస్ట్ చేశారు సరే.. కానీ ఈ గొడవకు పుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు? జిల్లా కలెక్టర్, అధికారులు కదా? సాక్ష్యాలతో రమ్మన్నప్పుడు.. ఒక తటస్థ వేదిక మీద ఇద్దరు నాయకులను కూర్చోబెట్టి, మీడియా సాక్షిగా రికార్డులు ఎందుకు చెక్ చేయకూడదు? ప్రజల ఆస్తిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా.. సామాన్యుడు ఒక సెంటు భూమి ఆక్రమిస్తే బుల్డోజర్లు పంపే అధికారులు.. ఈ రాజకీయ నాయకులు రోడ్ల మీద కొట్టుకుంటుంటే, ఆస్తులు తగలబెడుతుంటే ఎందుకు వేచి చూస్తున్నారు.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కామారెడ్డి రాజకీయం మరో మలుపు తిరిగేలా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది..

