‘NBK 111’ షూటింగ్ స్టార్ట్‌… వణుకు పుట్టించే వయోలెన్స్!

by | Feb 24, 2026 | సినిమా

నటసింహం నందమూరి బాలకృష్ణ (Bala Krishna) ప్రస్తుతం తన కెరీర్ లో 111వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ‘ఎన్‌బీకే 111’ (NBK 111) వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఎస్‌.తమన్ మ్యూజిక్‌ అందించగా.. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. ముంబయి మాఫియా నేపథ్యంలో పవర్‌ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఈ కథను తయారుచేశారట.

ఇందులో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రెగ్యులర్ షూటింగ్ మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. చిత్రీకరణ మొదటి రోజే బాలకృష్ణ మీద పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకుడు గోపీచంద్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాలయ్యపై చిత్రీకరించే ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఒక్కో యాక్షన్‌ సీక్వెన్స్‌ అగ్ని తుపాన్‌ని తలపిస్తాయని, ఇందులో యాక్షన్‌ విజువల్స్‌ థియేటర్లలో ప్రకంపనాలు సృష్టిస్తాయని చిత్రబృందం చెబుతున్నారు. ఇక గోపీచంద్ మలినేని మార్క్ టేకింగ్, బాలకృష్ణ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు మేకర్స్.