చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ (Drushyam) ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా రానున్న మూడో చిత్రం ‘దృశ్యం 3’. తెలుగులో అగ్ర హీరో విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) కథానాయకుడిగా శ్రీప్రియ (Sri Priya) దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ (2014), వెంకటేశ్ హీరోగానే జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వంలో వచ్చిన ‘దృశ్యం 2’ (2021) సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ ఫ్రాంచైజీలో మలయాళం, హిందీ భాషల్లో ‘దృశ్యం 3’ చిత్రీకరణలు జరుపుకుంటున్నాయి. మలయాళంలో మోహన్ లాల్ (Mohan Lal) , మీనా (Meena) కాంబోలో వస్తోన్న ‘దృశ్యం 3’ విడుదలపై మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే హిందీలో అజయ్ దేవ్‌గన్, శ్రియా కాంబోలో ‘దృశ్యం 3’ కూడా తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే అసలు తెలుగులో ‘దృశ్యం 3’ పట్టాలెక్కుతుందా? ఇందులో హీరోగా మరోసారి వెంకటేష్ నటిస్తారా లేదా ? అని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘దృశ్యం-3’ రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రీమేక్‌ల కంటే ఎక్కువగా తెలుగు సినిమాలు చేసేందుకే వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ‘ఆదర్శ కుటుంబం AK47’ (Adarsa Kutumbam AK47) సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ‘దృశ్యం-3’ చేసినా, అప్పటికే ఒరిజినల్ మళయాళ వర్షన్ ఓటీటీలో వచ్చి ఉంటుందని, దాంతో ఆడియన్స్ రీమేక్ ను చూడటానికి ఇష్టపడరని వెంకటేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదికాక ప్రస్తుతం వరుస విజయాలతో జోరు మీదున్న వెంకీకి ‘దృశ్యం 3’ కోసం పారితోషికం విషయంలో కూడా నిర్మాతలకు ఇబ్బందులు వచ్చే అవకాశముందని ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘దృశ్యం-3’ రీమేక్ లో నటించకూడదని వెంకటేశ్ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై చిత్రబృందం అధికారికంగా ఏదైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.


