మరోసారి ఆ స్టార్ డైరెక్టర్‌తో బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే

by | Apr 14, 2025 | సినిమా

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘అఖండ 2 . తాండవం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మునుపటి బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’కు ఇది సీక్వెల్. ‘అఖండ’ను మించేలా ‘అఖండ 2: తాండవం’ను తెరకెక్కిస్తున్నారు. సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందనుంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మురళీకృష్ణగా, అఖండ (Akhanda) రుద్రసికిందర్‌ అఘోరాగా రెండు విభిన్నమైన పాత్రల్ని బాలయ్య పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరా కానుకగా ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇదిలా వుండగా బాలయ్య (Bala Krishna) మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. వీర సింహారెడ్డి సినిమాతో తనకు సూపర్ హిట్‌ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో కొత్త సినిమాను బాలయ్య చేయనున్నారు. గోపిచంద్ మలినేని ఇటీవల బాలయ్యకు ఓ కథని వినిపించారని తెలిసింది. కథలోని కొత్తదనం, తన పాత్ర నచ్చడంతో ఈ సినిమాకు బాలయ్య వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు. ఇటివలే ‘జాట్‌’ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన గోపీచంద్ మలినేని టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వృద్ధి సంస్థ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే