గత కొన్ని రోజుల క్రితం నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం అంటూ హడావిడి చేసి మళ్లీ ఆ ప్రాజెక్ట్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమా దర్శకుడు అనుకున్న ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) కూడా ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. దీంతో మోక్షజ్ఞ (Mokshagna) అరంగేట్రం మళ్లీ మొదటికొచ్చింది. నందమూరి అభిమానులేమో మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మోక్షజ్ఞ సినిమాకి రంగం సిద్ధమైనట్టు సమాచారం. బాలయ్య (Bala Krishna) ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ (Aaditya 999 Max) చిత్రం ద్వారా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రముఖ దర్శకుడు క్రిష్ (Krish) జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తవగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
భారీ విజువల్ స్కోప్ ఉన్న చిత్రంగా ఇది రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారని, ఏప్రిల్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. కాగా, 1991లో విడుదలైన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించిన సంగతి తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మదిలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను బాలయ్య చాలా కాలం క్రితమే ప్లాన్ చేసినప్పటికీ, మధ్యలో ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇక ‘ఆదిత్య 369’ తరహాలోనే ఇది కూడా టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందే అవకాశం ఉండటంతో, మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

