టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో #AA23 (AA23) వర్కింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా అంటే సహజంగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా, ఈ చిత్రంలో సూపర్ హీరో తరహా పాత్ర చేయనున్నారట అల్లు అర్జున్. ఇందులో ‘ఐరన్ హ్యాండ్’తో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుందనున్న ఈ మూవీకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయంపై తాజాగా స్పష్టత వచ్చింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్ కోసం ముంబైలో ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాగానే లోకేశ్ కనగరాజ్ సినిమా సెట్స్‌లోకి అల్లు అర్జున్ అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ చిత్రీకరణ మొదలుపెడతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ #23Theme అనే సాంగ్ కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన రికార్డును అందుకుంది. దీనికి ఇన్‌స్టాలో 1 మిలియన్ కంటే ఎక్కువ రీల్స్ అందుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఒక ఇండియన్ మూవీ అనౌన్స్‌మెంట్ థీమ్ OST ఈ స్థాయిలో వైరల్ అవ్వడం ఇదే తొలిసారి అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఇందులో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

